కేరళ నుంచి రాహుల్, బెంగుళూరు నుంచి మోడీ పోటీ??: దక్షిణాదిలో పట్టుకోసం జాతీయ పార్టీల తపన

06:35 - March 24, 2019

*దక్షిణాది పైనా దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు 

* అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి రాహుల్ పోటీ?

*వారణాసి బెంగళూరు నుంచి బరిలోకి మోడీ 

జాతీయ పార్టీలన్నిటి చూపూ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీదే ఉంది ప్రాంతీయ పార్టీలూ, స్థానిక సెంటిమెంట్ల మీద నడిచే ఇక్కడి రాజకీయాలని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి అందుకే ఇప్పుడు తమతమ సొంత నియోజకవర్గంతో పాడు పోటీ చేయాల్సిన ప్రధాన స్థానాలని దక్షిణాధినుంచి ఎంపిక చేసుకుంటున్నరు ప్రధాని రేసులో ఉన్న కీలక నేతలు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రేస్ నుంచి రాహుల్‌ గాంధీ తన సొంత నియోజకవర్గం యూపీలోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అమేథీ నుంచి గెలిచినందున ఇకపై ఆ సీటుపై ఆధారపడటం అంత సురక్షితం కాదని భావిస్తున్న రాహుల్‌.. ఈ దఫా మరో స్థానం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘జాతీయ స్థాయి నేతగా రాహుల్‌ గుర్తింపు పొందాలంటే దక్షిణాది నుంచీ పోటీ చేయడం అవసరం. వయనాడ్‌ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటమి అన్నదే లేదు.

ఆ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ షానవాజ్‌ ఇటీవలే మృతి చెందారు. దీంతో సిద్ధిఖి అనే నేతకు టికెట్‌ ఇచ్చినా పోటీకి ఆయన నిరాకరించారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయాలంటూ కేరళ పీసీసీ గట్టిగా కోరుతోందని పార్టీ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్‌ చాందీ తిరునవంతపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ను వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని కేరళ పీసీసీ కోరింది. కర్ణాటక, తమిళనాడు పార్టీ విభాగాలు కూడా తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలంటూ ఇప్పటికే ఆయన్ను ఆహ్వానించాయి’ అని చెప్పారు.

ఇక వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ప్రధాని మోడీ కూడాకర్ణాటకలోని బెంగళూరు(దక్షిణ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.  దక్షిణాదితోపాటు ఆ రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగు పర్చేందుకు ఈ వ్యూహం పని చేస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక బీజేపీ విభాగం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు పలుమార్లు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ రాష్ట్రంలోని 28 సీట్లకు గాను 21 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించాల్సిన స్థానాల్లో బెంగళూరు(దక్షిణ) కూడా ఉండటంతో ఇక్కడనుంచే మోడీ పోటీచేయనున్నట్టు భావిస్తున్నారు.