పుల్వామా దాడిలో....బయటపడ్డ పాక్‌ కుట్ర

12:00 - February 19, 2019

పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌ ప్రమేయం ఉందని ఆధారం దొరికింది. పుల్వామా దాడికి ఉపయోగించిన ఆర్డీఎక్స్ ను పాక్ సైనికుల నుంచి తీవ్రవాదులు సేకరించారని ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఈ పేలుడు పదార్థాలను కొన్ని నెలల కిందటే పాక్ నుంచి తీసుకువచ్చి ఇక్కడే కలిపి కారు బాంబు తయారు చేశారని నిపుణులు తేల్చారు. బాంబర్ పేల్చిన వాహనం మారుతీ ఈకో వ్యాన్ అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ణయానికి వచ్చారు. ఈ కారు బాంబును పాక్ లో శిక్షణ పొందిన వ్యక్తి తయారు చేశాడని, టిగ్గర్ స్విచ్, డిటోనేటర్, పవర్ ఫ్యూజ్ లను సంఘటన స్థలం సమీప ప్రాంతంలోనే అమర్చాడని నిపుణులు చెప్పారు. పుల్వామా పేలుడులో 50 నుంచి 70 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని సీనియర్ పేలుడు పదార్థాల నిపుణుడు వెల్లడించారు. మన భారతదేశంలో సైన్యం వాడే ప్రతీ గ్రాము ఆర్డీఎక్స్ పై ఆడిట్ చేస్తుంటారని, కానీ పాకిస్థాన్ మిలటరీ వాడే పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు సరఫరా చేస్తుంటారని ఇంటలిజెన్స్ వెల్లడించింది. పుల్వామాలో బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ మానసికంగా పేల్చుకునేందుకు సిద్ధమయ్యాడని భావిస్తున్నారు.