స్టాచ్యూ ఆఫ్ వర్జినిటీ ఎక్కడ ఉంది?: పోస్టుల ఫ్రొఫెసర్ మీద విమర్శల వెల్లువ

13:47 - January 16, 2019

కోల్‌కత్తాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో కనక్ సర్కార్ 20 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను తరచూ ఇదే తరహా పోస్ట్‌లు పెడుతూ వివాదాస్పద చర్చలకు తెరలేపుతుంటాడు. "చాలా మంది అబ్బాయిలు మూర్ఖులు. కన్యత్వం కలిగిన అమ్మాయి భార్యగా వస్తే కలిగే ప్రయోజనాలు వారికి తెలియదు. వర్జిన్ గర్ల్ సీల్డ్ బాటిల్ లాంటిది. సీల్డ్ ఊడిన బాటిల్‌ను ఎవరైనా కొంటారా? భార్య విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అంటూ ఒకసారి. 

 పరిపూర్ణ కన్యత్వం కలిగిన మహిళలు భార్యగా దొరికితే కలిగే లాభాల గురించి తెలియక చాలామంది యువకులు ఫూల్స్ అవుతున్నారని పోస్ట్ పెట్టాడు. "పుట్టుకతో కన్యత్వం పొందిన బాలిక భార్యగా కూడా అలానే ఏకపాతివ్రత్యంతో ఉండగలిగితే ఆమె దేవత లాంటిద"ని మరోసారి పోస్ట్ చేశాడు. సీల్ తీసిన కూల్‌డ్రింక్‌ను ఎవరైనా కొంటారా అని ఆయన మహిళల కన్యత్వంపై చేసిన పోస్ట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విమర్శలు రావడంతో ఆ తరువాత డిలీట్ చేశాడు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని, ఇలాంటివి రాసే స్వేచ్ఛ తనకు ఉందని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.
   
 ఇదొక్కటే కాదు.. కొద్ది నెలలుగా కన్యత్వంపై కనక్ సర్కార్ పెట్టిన పోస్ట్‌లు చూసిన కొందరు ఆయన ఫొటోను మార్ఫింగ్ చేసి స్టాట్చ్యూ ఆఫ్ వర్జినిటీ అని ఆయనను ఉద్దేశించి ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఆయన ఇలాంటి పోస్ట్‌లే చేశాడు. ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వర్జినిటీని పవిత్రంగా భావించడం లేదని. ఈ కారణం వల్లే చాలామంది అమ్మాయిలు కొందరు జిత్తులమారి అబ్బాయిల చేతిలో మోసపోతున్నారని కామెంట్ చేసాడు.

జపాన్ దేశంలో 99శాతం మంది అమ్మాయిలు పెళ్లికి ముందు కన్నెగానే ఉంటున్నారని. అది నిజంగా గర్వించదగ్గ విషయమని పోస్ట్ చేశారు. ప్రొఫెసర్ కనక్ సర్కార్ పెట్టిన వివాదాస్పద పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇతర వర్గాలు, మహిళా సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెంటనే ఆయన ఫేస్‌బుక్ నుంచి పోస్టును డిలీట్ చేశారు. అయినప్పటికీ ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రొఫెసర్ పోకిరీ మైండ్ సెట్‌ బయటపడిందంటూ కొందరు, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసరే ఇలాంటి కామెంట్లు చేస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఇలా వర్జినిటీ గురించి వివాదాస్పద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచిన ఈ ప్రొఫెసర్ గతంలో ఆయన సేవలకు డాక్టరేట్ కూడా పొందడం కొసమెరుపు.