నన్స్ ని సెక్స్ బానిసల్లా ఉంచేశారు: పాపాన్ని అంగీకరించిన పోప్

23:05 - February 6, 2019

ఇప్పటి వరకూ ఒక అనుమానంగానే ఉన్న విషయాన్ని ఒక్క సారిగా ముసుగు తీసి మరీ చూపించారు పోప్ ఫ్రాన్సిస్. చర్చిల్లో నన్స్‌పై జరిగే దారుణాలపై పోప్ ఫ్రాన్సిస్ తొలిసారిగా స్పందించారు. క్యాథలిక్ చర్చిల్లో పాస్టర్ల చేతిలో నన్స్ లైంగిక వేధింపులకు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. అంతే కాదు  బిషప్ స్థాయి వ్యక్తులు కూడా నన్స్ పై ఈ తరహా దారుణాలకు ఒడిగడుతున్నారని తెలిపారు. చారిత్రక యూఏఈ పర్యటనను ముగించుకొని వాటికన్‌ సిటీకి  వెళ్తున్న పోప్‌. విమానంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియానిటీలోకి మహిళా బానిసత్వం ప్రవేశించిందని చెప్పిన ఆయన, మతాధికారులు, క్రైస్తవ మతపెద్దలు దాన్ని సెక్స్ బానిసత్వంగా భావిస్తున్నారని అన్నారు.

 "కొందరు ప్రీస్టులు, బిషప్స్ నన్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కారణంగా అతిపవిత్రమైన ప్రార్థనామందిరాలు అపఖ్యాతికి గురవుతున్నాయి. దీన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నాం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారులను సస్పెండ్ చేశాం" అన్న పోప్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచం ముక్కున వేలు వేసుకునేలా చేసాయి. చర్చిల్లో మతాధికారులు పిల్లలు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు చాలాకాలం నుంచీ ఆరోపణలు వస్తున్న సమయంలో పోప్ నన్ల వేధింపులపై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


చర్చిల్లో జరుగుతున్న దారుణాలపై వాటికన్‌ సిటీకి చెందిన ఓ మహిళల మేగజైన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఎంతో మంది నన్స్ లైంగిక వేధింపులకు గురై గర్భాన్ని తొలగించుకోవడమో, పిల్లల్ని కనడమో చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఓ కథనంలో వెల్లడించింది. గతేడాది కేరళలోని ఓ చర్చిలో బిషప్ తనను చాలాసార్లు రేప్ చేశాడని ఓ నన్ ఆరోపించడంతో ఈ అంశంలోని తీవ్రత ప్రపంచానికి తెలిసొచ్చింది. 

 ఓ నన్‌పై పోప్స్, బిషప్ 13 సార్లు రేప్ చేసిన సంఘటన సంచలనం క్రియేట్ చేసింది. అమెరికాలోని 700 మంది బిషప్స్, పాస్టర్స్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు చిలీలో కూడా మతాధికారులు నన్లను వేధించినట్లు వార్తలు రావడంతో గత ఏడాది వాటికన్ ఒక దర్యాప్తు ప్రారంభించింది. ఈ వేధింపులు బయటపడడంతో మహిళలను ఆర్డర్ నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది ఇటలీ, ఆఫ్రికాలో కూడా వేధింపుల కేసులు వెలుగుచూసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ గత ఏడాది తెలిపింది. వేధింపుల గురించి బయటికి చెప్పకుండా నోరు నొక్కేస్తున్న "కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీక్రెసీ"ని గత ఏడాది నవంబర్‌లో "కాథలిక్ చర్చ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ నన్స్" ఖండించింది.


కొంత మంది పాస్టర్లు నన్స్‌ను సెక్స్ బానిసలుగా మార్చుకున్నారనే వార్తలు కూడా వాస్తవమేనని పోప్ తెలిపారు. అలాంటి వ్యక్తుల కారణంగా చాలా మంది నన్స్.. పిల్లలకు జన్మనిచ్చారని అన్నారు. అయితే.. చర్చిల్లో జరుగుతున్న వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని.. అలాంటి వ్యక్తులపై చర్యలు కొనసాగుతున్నాయని పోప్ వెల్లడించారు. లైంగిక ఆరోపణల్లో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.