యాత్ర కి పోటీగా నేనే ముఖ్యమంత్రి ? : సినిమాలతో పొలిటికల్ వార్?

00:51 - February 8, 2019
* భారీ విడుదలకు రెడీ అయిన ‘యాత్ర’
*‘యాత్ర’ సినిమా పోటీగా ‘నేనే ముఖ్యమంత్రి’ 
*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా?
 

 

బయో పిక్ ఇప్పుడు ఎంత సక్సెస్ ఫుల్ ఫార్ములా అన్నది చాలామందికి తెలుసు. ఇటు కలెక్షన్ల పరంగా పెద్దగా లాభ సాటి అయినా కాకున్నా పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రం ఈ సినిమాలు కీలకం అని భావిస్తున్నారు పార్టీ నేతలు. ఇదే నేపథ్యంలో "నరేంద్ర మోడీ" బయోపిక్, ఆక్సిడెంటల్ పీయం" అంటూ కాంగ్రేస్ ప్రభుత్వం నాటి రియల్ లైఫ్ క్యారెక్టర్లతో వచ్చిన సినిమా, బాల్ థాక్రే మీద వచ్చిన సినిమా, కోలీవుడ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం పై సినిమా ఇవన్నీ ఈ పొలిటికల్ బయోపిక్ ట్రెండ్ లో భాగమే.

ఇక మనదగ్గర వచ్చిన ఎన్టీఆర్ బయో పిక్ "కథానాయకుడు" త్వరలో రాబోతున్న రెండోభాగం సంగతి తెలిసిందే అదే బాటలో ఇప్పుడు రాబోతున్న మరో బయోపిక్ "యాత్ర".  సినిమా అనేది పొలిటికల్ ప్రచార మాధ్యమంగా మారిన శమయంలో "యాత్ర" హిట్ అయితే ఆ ఇంపాక్ట్ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందనేది ఒప్పుకోవాల్సి విషయమే. వైఎస్ బయోపిక్ మూవీ కనుక ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేయడం ద్వారా మళ్ళీ జన్నాన్ని జగన్ పార్టీ వైపుకి తిప్పవచ్చు అనే అనిపించకమానదు. 


దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ‘పాదయాత్ర’ త‌న రాజ‌కీయ యాత్రలో ఎంత కీల‌క‌మో కొంత‌మందికే తెలుసు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితి దృష్ట్యా ఆయ‌న ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర‌గా వెళ్ళాల‌ని నిశ్చ‌యించుకున్న‌ప్పుడు ఆయ‌న‌కి ఎదురైన అనుభవాలు.. ఆటంకాలు.. వాట‌న్నింటిని కాద‌ని క‌డ‌ప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి స్వ‌యంగా వెళ్ళి పేద‌వాడి స‌మ‌స్య‌లు తెలుసుకోవడానికి ఈ యాత్ర మెద‌లుపెట్టారు వైఎస్ ఆనాటి పాదయాత్రకి దృశ్య రూపమే యాత్ర అని చెప్తున్నారు.  


   అయితే ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కానివిధంగా  సరిగ్గా ‘యాత్ర’ విడుదలకు ముందు ‘నేనే ముఖ్యమంత్రి’ అనే సినిమా ఒకటి తెరపైకి వచ్చింది. దేవీప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ రావిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్‌ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా కూడా ఈరోజే విడుదల కానుంది. చిత్రంలో నటించిన నటుల్లో దేవి ప్రసాద్ తప్ప సాంకేతిక బృందం, ఆఖరికి దర్శకుడు "మోహన్ రావిపాటి" ఇలా ఎవరూ పెద్దగా తెలిసిన వాళ్లు కాదు. అయితే ‘యాత్ర’ సినిమా పోటీగా ‘నేనే ముఖ్యమంత్రి’ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు. అంటే ఈ రోజు రాబోతున్న "యాత్ర" తో పాటు ఈ సినిమా కూడా విడుదల కానుందన్న మాట. 

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో  గద్దె రామ్మోహన్, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు తదితర టీడీపీ ముఖ్య నాయకులకు స్టేజ్‌పై నుండే నిర్మాతలు ధన్యవాదాలను చెప్పడం ద్వారా ‘యాత్ర’ సినిమాకి పోటీగా కావాలనే ఈ సినిమాని ఈ సమయంలో విడుదల చేస్తున్నారా అన్న అనుమానం రాకపోలేదు. ఈ సినిమాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా ఉండబోతుంది. అని టాక్. అయితే అటు రాజశేఖర రెడ్డి నిజజీవితం ఆధారంగా తీసిన కథ కావటం, ఇంకో పక్క మమ్ముట్టి లాంటి స్టార్ స్టామినా తోడవ్వతం "యాత్ర" కి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.. కానీ ఏమో గుర్రమెగరా వచ్చు అనుకునే వాళ్ళూ లేకపోలేరు.