శశిరేఖ : పుస్తకపరిచయం; సిద్ధార్థ కట్టా

02:01 - April 4, 2019

 

 

 

 

                                                    

 

                                               చెలమూ-శశిరేఖా-నేనూ

శశిరేఖ పాదాల కింద నలిగిన పూలన్నీ తిరిగి వికసిస్తాయి. శశిరేఖ కాలాల కింద దొర్లిన రోజులన్నీ నదుల్లా ప్రవహిస్తాయి. అంతఃసౌందర్యంలో మొలకెత్తలేనివారంతా ఇప్పటికిప్పుడు ఎండిపోండి. మీ ఎరొటిక్ కలల స్వప్నసుందరీ, సుందరమయూరీ కానే కాదు శశిరేఖ. హృదయాలకు వేలాడుతున్న కోట్ల ఇంపొటెంట్ మర్మాంగాల దేహాలను కంటిచూపు కొనలతో విసిరివిసిరికొట్టగలదు ఆమె. శశిరేఖ హృదయానిది అంతులేకుండా వికసిస్తూవుండే పువ్వు సౌందర్యం. ఆమె... పూవుకు పూయడం నేర్పగల మంచుగాలి మంచిగాలి, ఆమే గాలి. తనే మట్టిరేణువు. తనే మట్టికుండ. తనే మట్టివాసన, తానే మట్టి, తానే నేల.

                             గుండెలోకి పాట పారినట్టూ, పల్లంలోకి నీళ్లు నడిచినట్టూ, ప్రేమ లోతులోతుల్లోలోతుల్లోలోతుల్లోకి దుమికి... ఆవిరై, మేఘమై, వర్షమై, సంద్రమై తానే ప్రేమై కురిసే ప్రేమే శశిరేఖ. నేలమీద రాలిన తొలివాన చుక్క రూపం ఆమెదే. రాలబోయే మలివర్షపు చుక్క దేహమూ ఆమెదే. ఆమే నీరు. నిత్యం గుండె జవజావాలాడే ప్రేమఊటల సమూహాల సంగమాల సమూహాల సంగమాల సమూహాల సంగమం శశిరేఖ.

                             మీ పరమపవిత్ర పరిశుద్ధకార్యాల కార్యాచరణల మొహావేశాలను వయాగ్రా బిళ్ళలకు మళ్తే చూసే ప్రేమికే ఆమె. మీ మీ చీకటి సాంప్రదాయాల ముడివిప్పుతూ, వెలుగురెక్కలనద్ది మోగే వేయి వీణల గొంతు శశిరేఖది. ముసగుల చాటున ముసుగులేసుకున్న మనుషులేసే రాళ్ళన్నీ ఆమెను తాకాకుండానే వేయి శకలాలవుతాయి. ప్రేమించడం మాత్రమే తెల్సిన శశిరేఖ, ప్రేమించడం తెల్సిన వాళ్లకు మాత్రమే అర్ధమవుతుంది. పిల్లలున్న చోట ఆనందాలను వెతికినట్టూ, రాత్రి ఆకాశంలోకి ఆబగా చంద్రుడి కోసం చూసినట్టూ, ప్రియురాలి కోసం నగరమంతా ఓ రోజాపువ్వును వెతికినట్టూ, ప్రేమకోసం శశిరేఖను వెతకండి. ప్రేమను ప్రేమించే ఆమెను వెతకండి. లోకాన్ని ప్రేమమయం చేసే తనకోసం పచ్చని వనాన్ని నిర్మించుకుని నిరీక్షించండి. మీతోట నిండా ప్రేమ పూస్తుంది.

శశిరేఖ పాడే పాటే శశిరేఖ. శశిరేఖ మాటే శశిరేఖ. శశిరేఖ హృదయమే శశిరేఖ. ప్రేమే శశిరేఖ. శశిరేఖే ప్రేమ. ...