5.80 లక్షల కోట్లను ప్రజలకు బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించాం: మోదీ

13:33 - January 23, 2019

భారత దేశంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, కానీ నాలుగున్నరేళ్ళలోనే ఆపనిని సమర్థవంతంగా నిర్వహించామని ప్రధాని మోది విమర్శించారు. తాను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో 15వ ప్రవాస భారతీయుల దినోత్సవాలను ఆయన మంగళవారం ప్రారంభించారు, నాలుగున్నరేళ్ల తమ పాలనలో 85 శాతం అవినీతికి అడ్డుకట్ట వేశామని చెప్పారు.


కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతుందని మాజీ ప్రధాని ఒకరు  చెప్పినా అలా జరగకుండా చూడడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయాయని నాటి ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారు.  ‘రుగ్మత ఏమిటో కాంగ్రెస్‌కి తెలుసు. దానిని నయం చేసే ఔషధాన్ని ఇవ్వాలనే ఆలోచన మాత్రం చేయలేకపోయింది. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

నిధులు కిందివరకు చేరడంలో లోపాలను సాక్షాత్తూ అప్పటి ప్రధానే గుర్తించినా ఆ తర్వాత 10-15 ఏళ్లలోనూ లూటీని అడ్డుకునేందుకు ఎలాంటి కృషి జరగకపోవడం విచారకరం. మధ్య తరగతి ప్రజలు చిత్తశుద్ధితో పన్నులు చెల్లిస్తుంటే 85 శాతం లూటీ మాత్రం నిరాటంకంగా సాగిపోతూ వచ్చింది. ఈ లూటీని పూర్తిగా ఆపడానికి మేం సాంకేతికతను మార్గంగా ఎంచుకున్నాం.

త నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 5.80 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించాం. మా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుసరించి ఉంటే రూ. 5.80 లక్షల కోట్లలో రూ. 4.50 లక్షల కోట్ల మేర లూటీ జరిగేదని అన్నారు. లూటీ జరగకుండా తాము వ్యవస్థలో మార్పును తీసుకొచ్చామని తెలిపారు.

గృహ నిర్మాణం, విద్య, ఉపకార వేతనాలు, గ్యాస్‌ సిలిండర్లు వంటి వాటికి ఇచ్చే డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే బదలాయించేలా చేశాం. పాత పద్ధతిలోనే దేశం నడుస్తూ ఉన్నట్లయితే ఇలాంటి రూ.5,80,000 కోట్లలో రూ.4,50,000 కోట్లు పక్కదారి పట్టి ఉండేవని. భారత్‌ మారదనే ఆలోచన ధోరణిని ప్రపంచ దేశాల్లో తాము మార్చగలిగామన్నారు.


అంతేకాదు ప్రసంగ ముగింపులో ఎన్నారైలనూ ఆకాశానికెత్తారు మోదీ. ప్రవాస భారతీయులే ప్రపంచానికీ  భారతదేశానికీ రాయబారులు అంటూ మోదీ కితాబిచ్చారు. 'భారత్ ఎప్పటికీ మారదు' అనే అభిప్రాయాన్ని తాము మార్చామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోషిస్తున్న పాత్ర చాలా గొప్పదని... ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు.