ఆ చిత్రాన్ని రిలీజైన రెండోరోజునుంచే థియేటర్ల నుంచి తొలగిస్తున్నారట!

11:26 - January 9, 2019

సంక్రాంతి బరిలో రజనీ `పేట` చిత్రాన్ని థియేటర్లు ఇవ్వకుండా నలిపేస్తున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా `పేట` తొలి రోజు(జనవరి 10న) భారీగానే థియేటర్లను దక్కించుకున్నా - రెండో రోజు నుంచే బిగ్ పంచ్ పడనుంది. జనవరి 11న - వినయ విధేయ రామ - జనవరి 12న - ఎఫ్ 2 చిత్రాలు అత్యంత భారీగా రిలీజవుతుండడంతో జనవరి 10న రిలీజవుతున్న `పేట` చిత్రాన్ని రెండో రోజు నుంచి మెజారిటీ పార్ట్ థియేటర్ల నుంచి తొలగించనున్నారు. ముఖ్యంగా మెట్రో నగరం హైదరాబాద్ లో వందలాది థియేటర్లు - స్క్రీన్లు ఉంటే అన్నిటినుంచి ఈ సినిమాని తొలగించనున్నారట. అంటే జనవరి 11 నుంచి పేట చిత్రం కేవలం రెండు థియేటర్లు మినహా హైదరాబాద్ లో ఎక్కడా ఆడదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - సప్తగిరి థియేటర్ - మల్కాజిగిరి- రాఘవేంద్ర థియటర్ లను `పేట`కు కేటాయించారు. ఇక మల్టీప్లెక్సుల్లో అసలు ఈ సినిమాకి స్కోప్ అన్నదే లేకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. హైదరాబాద్ లో వినయ విధేయ రామ ఎఫ్ 2 చిత్రాలకు చాలా ముందే థియేటర్లను కేటాయించారు. ఈ రెండు సినిమాల్ని అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ముందస్తు ప్లాన్ సాగింది. అందువల్ల హైదరాబాద్ లో పేట చిత్రానికి ఛాన్సే లేదని తెలుస్తోంది.