పవన్‌ ఎవ్వరినీ వదలట్లేదుగా...?

11:30 - March 23, 2019

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌...కేంద్రంలోని మోడీ నుంచి మొదలుపెట్టి రాష్ట్రాల్లోని కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌లతో సహా ఎవ్వరినీ ఒదలకుండా అందరినీ వారు చేసిన పనుల గురించి కడిగిపారేస్తున్నారట!. తాజాగా ఆయన పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు.. వాడుతున్న భాష.. తెర మీదకు తెస్తున్న అంశాల్ని చూస్తే.. పవన్ కొత్త తరహా వ్యూహాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. తనకు ఎవరూ దగ్గర వారు కాదని.. అందరూ అందరేనన్న భావన కలిగేలా పవన్ మాటలు ఉన్నాయి. ఏపీ గురించి తానుఆలోచించినట్లుగా ఆలోచించే వారు లేరన్నట్లుగా పవన్ తాజా మాటలు ఉన్నాయి.  

పవన్‌ మాట్టాడిన వారిలో మొదటగా మోడీని తీసుకుంటే...ఆయన ప్రసంగం ఇలా వుంది....

 ప్రధాని మోదీ అంటే మన పార్లమెంటు సభ్యులకు భయం. పార్లమెంటులో సమస్యల గురించి అడుగుతారని.. మోదీ వెనక్కి చూస్తే వైకాపా ఎంపీలు బల్లల చాటున కిందకు కూర్చుండిపోతారు. తెదేపా ఎంపీలు ముఖం కనబడకుండా దాచుకుంటారు’’

  దమ్ము - ధైర్యం - తెగింపు ఉండి సాహసం చేయగలిగిన నాయకులను జనసేన తరపున బరిలోకి దింపా.  ఓట్లు వేయించుకుని పార్లమెంటు హాల్లో పడుకునే వారిని కాకుండా పోరాటం చేసేవారిని రంగంలోకి దించాం అని పవన్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు గురించి చేసిన ప్రసంగాలను చూస్తే...

2019 ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థ మారకపోతే చాలా కష్టం. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ మెంట్ ఉన్నట్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా త్వరలోనే రిటైర్ మెంట్ ఇవ్వాల్సిందే.

  జగన్ నూ - నన్నూ ఒకేగాటన కడతారా?  జగన్ చేసే అక్రమాలు మీ ఎమ్మెల్యేలూ చేస్తున్నారు. దళితులపై దుర్భాషలాడతారు. ఆడపడుచులపై దాడులు చేస్తారు. దౌర్జన్యాలకు దిగుతారు. ఇవన్నీ చేసే చింతమనేనికి మీరెందుకు టిక్కెట్టు ఇచ్చారు. ఈ రౌడీ ఎమ్మెల్యేలకు జాతీయజెండా పట్టుకునే అర్హత ఉందా?అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురించి చూసినట్లయితే...

తెలంగాణలో ఆంధ్రులు ప్రచారం చేస్తే అంగీకరించని తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి?  తెరాస సత్తాచాటాలనుకుంటే మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ నిలిపి ప్రచారం చేయండి. టీఆర్ ఎస్ వాళ్లు ఆంధ్రా ప్రజలను ద్రోహులని తిట్టారు - రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులను రాళ్లతో తరిమికొట్టారు. కేటీఆర్ ఆంధ్రావాళ్లను పెద్దపెద్ద తిట్లు తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా? గోదావరి రక్తం మీలో ప్రవహించడం లేదా? అటువంటి వారిని ఇక్కడకు ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉంది.  ఇదే విషయంపై తాను పోరాటం చేస్తే దాడికి యత్నించారు. అయినా నేను వెనకాడలేదు. ధైర్యమే నా నైజం.  గత ఎన్నికల్లో పవన్ ఎక్కడున్నారంటూ వెతికిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో పాల్గొనడం మంచిది కాదు. 

జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి చూస్తే...

ఇంట్లో హత్య జరిగితే గుర్తించలేని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఏం న్యాయం చేస్తారు? 

.‘కిరాతకంగా చంపేశారు వేలిముద్రలు దొరకలేదు - రక్తపు మరకలు లేవు - కొన్ని గంటల తర్వాత లెటరు దొరికింది..ఇలా చెబుతున్నారు.. పినతండ్రి బాధ్యత మీది కాదా..మీ ఇంట్లో జరిగే హత్యకే ఏం మాట్లాడకపోతే భీమవరంలో అలాంటి సంఘటనలు జరిగితే మీరేం అడ్డుకుంటారు అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. తను పోటీలో ఉన్న విషయం మరిచిపోయి జగన్ పార్టీ  అభ్యర్థి నిత్యం టీఆర్ఎస్ నేతలతో బిజీగా ఉంటున్నారు. బ్యాంకుల్లో నగదు దాచుకుని కుటుంబ అవసరాలకు పిల్లల వివాహ చదువులకు ఉపయోగించుకుందామనుకుంటే అతని మనుషులు అర్బన్ బ్యాంకును దివాళా తీయించారు.పదివేల కుటుంబాల ఉసురు మూటగట్టుకున్నారు. అలాంటి వ్యక్తి తక్షణం ఎన్నికల నుంచి విరమించుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఇలా ఒక్కరిని కూడా వదలకుండా పవన్‌ అందరిపై విమర్శలు చేస్తూ ప్రసంగాన్ని చేశారు.