ఆగ్రహించిన అన్నదాత...

16:57 - February 26, 2019

మహారాష్ట్ర రైతుల పాదయాత్ర సీన్‌ తెలంగాణాలో రీపీట్‌ కానుందా..? పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనలు ఇప్పుడు అసెంబ్లీ వరకూ చేరుకోనున్నాయా...? ఆరుగాలం రెక్కల కష్టం దళారులు తన్నుకుపోవడంతో..ఏటికేడు ఊబిలోకి కూరుకుపోతున్న రైతన్న ఆవేశం ఇప్పుడు ఏ రూపం తీసుకోనుంది...? అంటే మనం ఈ రైతన్నల కష్టాలను చూడాల్సిందే...
అన్నదాతలు ఎంతో కలత చెందితే తప్ప రోడ్డెక్కరు. గిట్టుబాటు ధర కాస్త అటు ఇటుగా ఉన్నా సరుకుపోయే తత్వం రైతన్నది. కానీ ఇంకా ఎంతకాలం అలా భరిస్తూ పోవాలి...? దళారుల దోపిడిని అంతమొందించే మార్గమే లేదా...? ఏటికేడు ఇదే కన్నీటి గోస. సర్కారుకు అనేకసార్లు మద్దతు ధరకోసం గోడు వెల్లబోసుకున్నా పట్టింపులేనితనమే అన్నదాతలను ఆందోళనల బాట పట్టించిందా...? అంటే అవునని చెప్పక తప్పదు. ఈ నెలలో ఏకంగా నిజామాబాద్‌ ఎర్రజోన్న రైతుల నాలుగు సార్లు రోడ్డెక్కి నిరసన తెలిపినా కూడా..సర్కారు నుంచి స్పందన రాలేదు. జగిత్యాల పసుపు రైతు వేదననూ పట్టించుకోలేదు. దాంతో విసిగివేసారిన రైతాంగం సోమవారం నాడు నిజామాబాద్‌, జగిత్యాల ప్రధాన రహదారులపై అర్థనగ ప్రదర్శనలు, బైఠాయింపులు, రాస్తారోకోలు చేపట్టారు. మద్దతు ధర కల్పించాలని నినాదాలు చేస్తూ... రోడ్డుమీదనే వంటా వార్పుకు దిగారు. మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన రమేష్‌ అనే రైతు ఆవేదనతో కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా రైతులు కాపాడారు. మంగళవారం నాడు కూడా రైతులు తమ డిమాండ్‌ల కోసం ఆందోళనలు కొనసాగించనున్నారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల రైతు ఐక్య వేదికల ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌కు పాదయాత్రగా రైతులు బయలు దేరారు. హైదరాబాద్‌కు ఏరోజు చేరుకుంటే...ఆ రోజున ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు తమ గోడు వెల్లబోసుకుంటామని అన్నదాతలు పేర్కొంటున్నారు. 
ఇంతకీ నిజామాబాద్‌, జగిత్యాల రైతుల ప్రధాన డిమాండు ఏంటి...? పసుపు, ఎర్రజోన్నరకు గిరాకీ ఉన్నా...రైతుకు మద్దతు ధర తగ్గిస్తోంది ఎవరు? ఏటికేడు జరుగుతున్న పసుపు, ఎర్రజోన్న రైతుల దోపిడికి అడ్డు కట్టపడేది ఎప్పుడు..? ఆఖరి ప్రయత్నంగానే అన్నదాతలు అసెంబ్లీకి పాదయాత్రగా కదిలారా...?అంటే అవుననే చేప్పాల్సి వస్తుంది. 
నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌ పసుపు, ఆ తర్వాత ఎర్రజోన్న అధికంగా సాగవుతోంది. ఆ తర్వాత జగిత్యాలలోనూ ఈ పంటలు పండుతాయి. అలా చెప్పడం కంటే...అక్కడి నేలలో పండే సారానికి, అక్కడి రైతులు కష్టపడే గుణం తోడయ్యిందని చెప్పడం సముచితం. కానీ వారికి సర్కారు నుంచి అందుతున్న చేయూత మాత్రం ఏమీలేదు. పసుపు, ఎర్రజోన్నలకు ప్రత్యేక మార్కెట్‌ కల్పించాలనే ఏళ్లనాటి డిమాండును అటకెక్కించాయి గత ప్రభుత్వాలన్నీ. తెలంగాణ వచ్చాక కూడా అదే పరిస్థితి. దీంతో దళారులు ఆడే సిండికేట్‌ ఆటలో ఏటికేడు ధర తగ్గుడే. మరోపక్క పసుపుకు, ఎర్రజోన్నకు మార్కెట్‌లో డిమాండు అధికంగా ఉన్నా కూడా ఇదే పరిస్థితి. ఈ దళారుల మయాజాలాన్ని కట్టడి చేయాల్సిన సర్కారు చేతులు కట్టుకోని వేడుక చూడటమే అందుకు కారణం. దాంతో ఎర్రజోన్న క్వింటాకు రూ.2,100. దళారులు అడ్డగోలుగా కొనుగోలు చేస్తుండగా, ఇక పసుపు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. క్వింటా పసుపునకు రూ.6వేలకే విక్రయించుకోవాల్సి వస్తుంది. ఈ రేటుకు ...ఒక్కో ఎకరా పసుపు సాగుచేసిన రైతుకు లక్ష రూపాయల వరకూ అప్పే మిగలనుంది. ఇలా అడ్డగోలు ధరలకు పంట విక్రయిస్తే...పోయినేడు మాదిరి ఈసారి కూడా అప్పుల పాలే అని గుండె పగిలిన రైతన్న... ఇప్పుడు రోడ్డెక్కాడు.
ఎర్రజొన్న క్వింటాకు రూ.3,500, పసుపుకు క్వింటాకు రూ.15000 చెల్లించాల్సిందేనని డిమాండు చేసున్నారు అన్నదాతలు. కనీసం అటుఇటుగా ధర ఉన్నా అన్నదాతలు సర్దుకునే వారు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఇప్పటికే పలుసార్లు సర్కారు దృష్టికి తీసుకెళ్లేలా... అనేక ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోనేలేదు. అందుకే ...ఆ అసంతృప్తి నుంచి పుట్టిన దుఖ:ం ఇప్పుడు కలిసికట్టుగా ఆందోళనల బాట పట్టించింది అన్నదాతలను. అది తెలంగాణ అసెంబ్లీ వరకూ కూడా నడిపిస్తోందంటున్నారు రైతు సంఘాల నేతలు.