పార్లమెంటు ఎలక్షన్స్‌: మీకు ఓటు లేదా...అయితే ఐదు రోజుల్లో వచ్చేస్తుందట!

11:36 - March 11, 2019

సార్వత్రిక ఎన్నికలకు.. పలు రాష్ట్రాల్లోజరిగే అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి తాజాగా జరిగే ఎన్నికల మీదనే ఉంది. అయితే పోలింగ్‌ రోజున హడావిడిగా...ఓటు ఉందా లేదా అని టెన్షన్‌ పడేకన్నా...ముందుగానే మేలుకొని, పనులు పక్కన బెట్టి ముందు ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకోవడం మంచిది.  ఒకవేళ ఓటు లేకుంటే.. ఐదు రోజుల పాటు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్హత ఉన్న ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకునే చివరి అవకాశంగా ఈ ఐదు రోజుల్ని చెప్పాలి. ఎవరికి వారు తమ ఓటును తనిఖీ చేసుకోవటం.. లేకుంటే వెంటనే ఫామ్ 6 అప్లికేషన్ ను నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో కానీ.. వెబ్ సైట్ ద్వారా కానీ.. ఎలక్షన్ కమిషన్ మొబైల్ యాప్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకునే వీలుంది.