ఆ సినిమా వల్ల నష్టం ఎంతో తెలుసా?

12:06 - December 30, 2018

బడ్జెట్ విషయంలో నియంత్రణ.. బిజినెస్ విషయంలో ప్రణాళిక లేకుంటే నిర్మాత నిలువునా మునిగిపోవాల్సిందే. పాపం.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన సుధాకర్ చెరుకూరి అనే కొత్త నిర్మాతకు ఇదే పరిస్థితి వచ్చింది. శర్వానంద్-సాయిపల్లవి-హను రాఘవపూడిల క్రేజీ కాంబినేషన్లో ఆయన ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఈ చిత్రంపై రూ.20 కోట్లదాకా పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ బడ్జెట్ విషయంలో అసలు నియంత్రణ ఉండదన్న ముద్ర వేయించుకున్న హను.. యధావిధిగా ఖర్చు పెంచేశాడు. రూ.30 కోట్లకు పైగా ఈ సినిమాకు బడ్జెట్ పెట్టారు. పబ్లిసిటీ సహా ఇతర ఖర్చులన్నీ కలిపితే లెక్క రూ.34 కోట్ల+ దాకా తేలింది. శర్వానంద్ సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ రేంజిలో ఆదాయం తెచ్చి పెట్టలేదు. ‘పడి పడి లేచె మనసు’కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి.. సినిమా అంచనాల్ని మించి ఆడేస్తే బడ్జెట్ వర్కవుట్ అయ్యేదేమో. కానీ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్సే సరిగా రాలేదు. ఇక బయ్యర్లు.. నిర్మాత పరిస్థితి ఏంటో చెప్పేదేముంది? థియేటర్ల ఆదాయం.. ఇతర మార్గాల నుంచే మొత్తం కలుపుకున్నా లెక్క రూ.16 కోట్లకు మించి తేలట్లేదట. దాదాపు 18 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆల్రెడీ ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. నామమాత్రంగా షేర్ వస్తోంది. మొత్తం షేర్ పది కోట్ల లోపే ఉంది. ఇక శాటిలైట్.. డిజిటల్.. డబ్బింగ్ హక్కుల డీల్స్ ఎలా జరిగాయో క్లారిటీ లేదు. ఇప్పటికే డీల్ కాకుంటే మాత్రం అది కూడా మైనస్సే. మొత్తానికి హను-శర్వాలను నమ్మి సినిమా తీస్తే నిర్మాత నిట్టనిలువునా మునిగిపోయాడు.