ఓఎల్‌ఎక్స్‌కు సైబర్‌ క్రైం పోలీసుల హెచ్చరికలు...

15:17 - January 5, 2019

సైబర్‌ క్రైం పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నెట్‌ వ్యాపార సంస్థ ‘ఓఎల్‌ఎక్స్‌’ దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘మీ వెబ్‌సైట్‌ను ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో పలువురు మోసాలకు ప్పాడ్డారని, ఇందుకు కారణం మీ సంస్థే’ అంటూ కొద్దిరోజుల క్రితం పోలీసులు తెలియ జేయడంతో సంస్థ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. అసలు ఏం జరిగిందంటే...సెకండ్ హ్యండ్ వస్తువులు అమ్మకాలు, కొనిగోళ్లకు ఓఎలెక్స్ సంస్థ ప్రాచుర్యం పొందింది. ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో ప్రకటనలు జారీ చేయడం ద్వారా కోట్లు కొల్లగొట్టవచ్చునని గుర్తించిన రాజస్థాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌కు చెందిన కున్వర్‌ అనే యువకుడు తన స్నేహితులు మహావీర్‌, నవీన్‌లతో ముఠాగా ఏర్పడ్డాడు. వీరు సైన్యంలో విధులు నిర్వహిస్తున్న కిషన్‌, తోమర్‌ అనే సైనికుల ఫొటోలు వినియోగించుకుని ఈ ఏడాది మార్చి నుంచి మోసాలకు తెరలేపారు. తొలుత ఐ-ఫోన్‌, శ్యామ్‌సంగ్‌ ఫోన్లు వినియోగించారు. అనంతరం ప్రముఖ కంపెనీల ల్యాప్‌టాప్‌లు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌లు, వివిధ కంపెనీల కార్లు విక్రయించనున్నట్లు ప్రకటనలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న వారు ముందుగా సగం డబ్బు పంపిస్తే వస్తువులు పంపిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేశారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ చేశారు. భరత్‌పూర్‌లో వీరిలాగే మరికొందరు తయారు కావడంతో ఆరు నెలల్లో 50 ముఠాలు పుట్టుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఐదువేల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనే 900 కేసులున్నాయి. ఈ ఆరు నెలల్లో వీరు దాదాపు రూ.25 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. దీంతో భరత్‌పూర్‌లో వీరిని పట్టుకునేందుకు వెళ్లగా కున్వర్‌, మహావీర్‌ దొరికారు. తీగ దొరకడంతో సైబర్‌ పోలీసులు డొంక కదిలిస్తున్నారు. దీంతో...వెబ్‌సైట్‌ ఆధారంగా జరుగుతున్న వ్యవహారాలపై నిశితంగా దృష్టిసారించి తప్పుడు ప్రకటనలను తక్షణం తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఎల్‌.చందన్‌ తెలిపారు. తప్పుడు ప్రకటనలను గుర్తించే బాధ్యతను ఇప్పటికే తమ ఐటీ ప్రతినిధులకు అప్పగించామని, చర్యలు మొదలుపెట్టామని తమకు ఫోన్‌ చేసిన పోలీసు అధికారులకు ఆయన వెల్లడించారు. కాగా, ఓఎల్‌ఎక్స్‌లో మోసపూరిత సమాచారం కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్  సైబర్‌ క్రైమ్స్‌ అదనపు డీసీపీ కె.సి.ఎన్‌.రఘువీర్‌ తెలిపారు.