' యన్‌.టీ.ఆర్‌ ' టీంకు లీగల్‌ నోటీసులు

13:39 - December 30, 2018

నందమూరి తారక రామారావు జీవితంలో అతి పెద్ద విలన్ ఎవరని అడిగితే ఎవ్వరైనా నారా చంద్రబాబు నాయుడనే చెప్పేస్తారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నారా చంద్రబాబు నాయుడి చేతిలో వెన్నుపోటుకు గురై పదవి నుంచి దిగిపోయి.. మానసిక క్షోభను అనుభవించి తనువు చాలించడం బహిరంగ రహస్యం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్  ముఖ్యమంత్రి కావడం ద్వారా రాజకీయ రంగంలోనూ శిఖరాన్ని చేరుకున్నారు. కానీ ఆ తర్వాత ఊహించని పతనాలు చూశారు. ఐతే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో ఇవన్నీ చూపించే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే ఈ సినిమా తీస్తున్నది చంద్రబాబు బావమరిది.. వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు చేసిందానితో పోలిస్తే ఎన్టీఆర్ తొలి పర్యాయంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాదెండ్ల భాస్కరరావు పొడిచిన వెన్ను పోటు చాలా చిన్నది. ఐతే ఈ చిత్రంలో దాన్నే పెద్దదిగా చూపించి.. నాదెండ్లను విలన్ గా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రోమోలు.. ట్రైలర్ చూసినా ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు నాదెండ్ల. ఈ చిత్రంలో తనను విలన్ గా చూపిస్తే తాను ఊరుకోనని ఆయన అన్నారు. ఈ మేరకు ‘యన్.టి.ఆర్’ టీంకు ఆయన లీగల్ నోటీస్ పంపారు. చరిత్రను తప్పుగా చూపించి.. తనను విలన్ గా ప్రొజెక్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.