హైదరాబాద్ లోనే చంపేసారు?: చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు మిస్టరీ వీడుతోంది

12:11 - February 2, 2019
ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కారులో గురువారం ఉదయం బయలుదేరిన ఆయన నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద హత్యకు గురికావడం జిల్లాలో సంచలనం కలిగించింది. జయరామ్‌ కారులో ఉన్న రెండో వ్యక్తి ఎవరన్నది అంతుచిక్కడం లేదు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు.. కారులోని మృతదేహం చిగురుపాటి జయరామ్‌దేనని గుర్తించారు. కార్లో వెనక సీట్లో కూర్చున్న ఆయన తలపై బలమైన గాయాలున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాల్లేవు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అయితే హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆయన నలుపు, తెలుపు రంగు గళ్ల చొక్కాను ధరించారు. పోలీసులు టోల్‌ప్లాజాల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలో మాత్రం డ్రైవింగ్‌ సీట్లో తెలుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది. జయరామ్‌ ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విజయవాడకు వస్తుండగా అతని కారును డ్రైవింగ్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, జయరామ్‌ మృతదేహానికి నందిగామలో పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పరిశీలించారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సికా... జయరాం హత్య కేసులో వినిపిస్తున్న పేరు. ఆమె జయరాంకు మేనకోడలు. ఎక్స్‌ప్రెస్‌ ఛానల్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. జయరాం ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సికా కనిపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే అకౌంటెంట్‌గా పనిచేసిన రామకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. జయరాం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి దసపల్లా హోటల్‌లో టిఫిన్‌ చేసినట్టుగా తెలిసింది. ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక్కొక్క చిక్కు ముడినే విప్పుతూ వస్తున్నారు... 
 
ఎవరీ జయరామ్‌?

విజయవాడవాసి అయిన చిగురుపాటి జయరామ్‌ గతం ఘనంగానే ఉంది కొన్ని విజయాలూ మరికొన్ని వివాదాలూ . 1984 నుంచి 1988 వరకు హైదరాబాద్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1993లో అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్‌లోని కోర్నెల్‌ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత వ్యాపారం రంగంలోకి దిగారు. అక్కడే స్థిరపడి అంచలంచెలుగా ఎదిగారు. అమెరికాలోనే సొంతంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి. విజయవంతంగా నడిపించారు. ఫ్లోరిడాలోని సైప్రెస్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. భారత్‌కు కూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆయన కంపెనీలకు చెందిన ఫార్మా ఉత్పత్తులను 35 దేశాల్లోని పలు సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌లో కోస్టల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2018 మే వరకు త్రిమూర్తి ప్లాంట్‌ సైన్స్‌కు చైర్మన్‌గా ఉన్నారు. 2011 నుంచి నేటి వరకు టెక్‌ట్రాన్‌ పాలీలీనెస్‌ లిమిటెడ్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి నేటి వరకు హెమారస్‌ థెరప్యూటీక్స్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఫ్లోరిడాలోని సైప్రెస్‌ ట్రస్ట్‌ కంపెనీకి చైర్మన్, సీఈవోగా సేవలందిస్తున్నారు. జయరామ్‌ ఎక్స్‌ప్రెస్‌ టీవీని కూడా స్థాపించారు. తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. 2017 జనవరిలో జయరామ్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. ఎక్స్‌ప్రెస్‌ టీవీ మాజీ ఉద్యోగులు జీతాల చెల్లింపుల విషయంలో ఏర్పడిన తగదాల వల్లే ఆయనపై క్రిమినల్‌ కేసు పెట్టారని పోలీసులు చెబుతున్నారు.