ఒక్కొక్కరూ ఒక్కోమాట : ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది?

00:46 - March 8, 2019

*ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది?

*ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలంగాణ ప్రజల డేటాను కూడా తీసుకుంది స్టీఫెన్ రవీంద్ర 

*ఒక్క ఓటు కూడా పోలేదు : ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది

 

 

ఐటీ గ్రిడ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసిన నేపథ్యంలో ద్వివేది వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డేటా చోరీకి పాల్పడి తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్ సీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఏపి డేటా చోరీ అయిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై విచారణ చేపట్టిన సైబారాబాద్ క‌మిష‌న‌ర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది. ఇక ఐటి గ్రిడ్స్ లో ఇప్ప‌టిక ప‌లు ద‌ఫాలుగా సోదాలు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు సంస్థ నిర్వ‌హ‌కుడు అశోక్ కోసం గాలింపు తీవ్ర‌త‌రం చేసారు.

అశోక్ ఏపిలోనే ఉన్నార‌ని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న విదేశాల‌కు వెళ్ల‌కుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసారు. ఆయ‌న‌కు సైబ‌రాబాద్ పోలీసులు త‌మ సంస్థ లో సోదాల కోసం వ‌స్తున్నార‌ని తెలిసి ముందుగానే హార్డ్ డిస్క్ లు స‌ర్వ‌ర్ ల తో వెళ్లిపోయారని..ఆయ‌న క‌ద‌లిక‌ల పై నిఘా పెట్టామ‌ని పోలీసులు చెప్పారు. 

"కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. డేటా చోరీ లో ప్రమేయం ఉన్నవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. సున్నితమైన ఈ డేటా ఆధారంగా ఓట్ల తొలగింపు జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. నిందితులు ఎవరైనా సరే, వది లేది లేదు. చట్టం ముందు అందరూ సమానులే. అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నాం. దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అంతే కాదు ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలంగాణ ప్రజల డేటాను కూడా తీసుకుందని స్టీఫెన్ చెప్పటం మరింత ఆసక్తికరంగా మారింది.

ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తు న్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి అయితే డేటా చోరీ, ఓట్ల గల్లంతూ అంటూ ఇంత గందరగోళం జరుగుతూంటే ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది అలాంటిదేమీ లేదని, అసలు ఓట్ల తొలగింపు అనే మాటే ఒక అబద్దమనీ చెప్పారు. జనవరి 11 తర్వాత ఒక్క ఓటు కూడా ఎన్నికల కమిషన్ తొలగించలేదని, ఫామ్ 7 అనేది కేవలం దరఖాస్తు మాత్రమేనని. అది మాకు వచ్చిన తర్వాత మేం పరిశీలించి. నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఓట్లు తొలగిస్తామని చెప్పారు.

ఫామ్ 7 మాకు చేరినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని వివరించారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా ఏపీలో 8 లక్షల మంది టీడీపీ ఓట్లను తొలగించారనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు ద్వివేది. కేవలం అది ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయన చెప్తున్నట్లుగా 8 లక్షల ఓట్లు గల్లంతు అయితే.. విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం వస్తుందని చెప్పారు. అయినా కూడా అన్ని లక్షల ఓట్లను తొలగించడం అసాధ్యం అని గుర్తుచేశారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కులేనట్లు గుర్తించామని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా పనిచేస్తుందని ద్వివేది స్పష్టం చేశారు. వాస్తవానికి ఏపీలో ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని.. జనాభా నిష్పత్తికి తగినట్లుగా ఓట్ల సంఖ్య లేదని ఆయన వివరించారు.