జగన్ పై దాడి కేసులో నటుడు శివాజీ విచారణ: ఆయనకు ముందే ఎలా తెలుసు

13:52 - January 17, 2019

 "ఆ దాడిగురించి నాకు ముందే తెలుసు, ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారు" అంటూ జగన్ పై కత్తి దాడి విషయంలో ఆమధ్య ఆపరేషన్ గరుడ అంటూ వచ్చిన శివాజి ఇప్పుడు చిక్కుల్లో పడనున్నారా? ఎందుకంటే ఈ కేసు విషయంలో ఒక్కొక్క తీగనే లాగుతూ వస్తున్న అధికారులు ఇప్పుడు ఈ విచారణలో భాగంగా నటుడు శివాజీ ని కూడా ప్రశ్నించనున్నారట.
 
 ఇక నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేయడానికి ముందు ఆయన పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లోకి కోడికత్తిని ఎలా తీసుకొచ్చాడు. ఎక్కడ దాచాడు.? ఎవరు సహకరించారనే దానిపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కోవలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని అయిన హర్షకుమార్ ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు.

ఇక ఈ కుట్ర గురించి ముందే తనకు తెలుసు అంటూ ‘ఆపరేషన్ గరుడ’ పేరు హల్ చల్ చేసిన సినీ నటుడు రాజకీయ నాయకుడు శివాజీ ని కూడా విచారించడానికి ఎన్ఐఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. "‘‘సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం, 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్‌ గరుడ లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది. ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి" అని స్తూలంగా సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ చెప్పిన విషయం తెలిసిందే" .

      ఏపీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయించి.. ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారని.. సీఎం చంద్రబాబును గద్దెదించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెరతీశారని శివాజీ అప్పట్లో సంచలన విషయాలు చెప్పాడు. సీఎం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నిజాలు ఎలా తెలుసు.? ఎవరు చెప్పారనే దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. శివాజీ వ్యాఖ్యలు అచ్చుగుద్దినట్టే తదనంతరం అలానే సంఘటనలు చోటుచేసుకోవడంతో ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మారింది.