న్యూజిలాండ్‌లో దారుణం: 40 మంది మృతి

14:02 - March 15, 2019

ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా, గొడవలు, హింసకు దూరంగా ఉంటుందన్న పేరున్న న్యూజిలాండ్ లో దారుణం చోటు చేసుకుంది. క్రిస్ట్ చర్చ్ నగరంలోని ఒక మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 40మంది  అక్కడికక్కడే మృతి చెందినట్లు - 20 మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం దుండగులు మసీదులోకి ప్రవేశిస్తూనే తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులకు దిగినట్లుగా స్థానికులు.. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.  క్రిస్ట్ చర్చ్ లోని మసీదులో దాదాపు 200 మంది ఉంటారని.. మసీదు వెనుక భాగం నుంచి దుండగులు వచ్చినట్లుగా చెబుతున్నారు. చాలాసేపు కాల్పులు జరిపినట్లుగా మోతలు వినిపంచాయని.. అక్కడి వారంతా ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురి అవుతుననారు. కాల్పుల ఉదంతంలో మసీదులో ఉన్న కొందరు గోడ దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం కాల్పుల ఉదంతంలో 40 మంది చనిపోయిన్నట్లుగా చెబుతున్నారు. ఘటనాస్థలం మొత్తం బీభత్సంగా తయారైనట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ పలువురిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న దాడితో భయానికి గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అంతేకాదు..ఈ దాడి సమయంలో  న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్ట్ అడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు  అదే ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ...వారు తప్పించుకున్నట్లు బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు. దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకొందని.. ఇది భయంకరమైన అనుభవంగా అతడు పేర్కొన్నారు. అందరి ఆశీస్సులు తమను కాపాడినట్లుగా ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు. కాల్పులకు కారణం తెలియరాలేదు.