ఫాదర్ ఆఫ్ ఇండియన్ గాడ్ ఫాదర్స్ (సినిమా సాహిత్యం)

02:42 - April 17, 2019

సినిమా: నాయకుడు 

భాష: తెలుగు 

దర్శకుడు: మణిరత్నం 

 

విచిత్రంగా అనిపించచ్వచ్చుగానీ ఇప్పటివరకూ ప్రపంచ పాపులర్ కథలన్నీ "విలన్" చుట్టూ తిరిగినవే. అయితే ఆ విలన్లే హీరోలు. చట్టం ప్రకారం దోషులే గానీ చుట్టూ ఉన్న జనం దృష్టిలో మాత్రం వాళ్ళు దేవుళ్ళు. ఎప్పుడో పిట్టకథగా విన్న రాబిన్ హుడ్ దగ్గరనుంచీ నిన్నా మొన్న వచ్చిన కాలా వరకూ చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళే కానీ జనం దృష్టిలో మాత్రం వీళ్ళు హీరోలే అయ్యారు. కారణం? "నలుగురిని బతికించేదేదీ తప్పుకాదు" అన్న మాటనే. 30ఏళ్ళకిందవచ్చిన సినిమాలోని మాట ఇది. ఇదే మాటని వీరయ్యకి హుసేన్ భాయ్ చెప్తాడు. ముంబై మహానగరాన్ని గడగడలాడించిన "గురు ఆఫ్ ఇండియన్ మాఫియా" అన్న స్థాయిలో పిలిపించుకోబడ్డ వరదరాజ మొదళియార్ జీవితం ఆధారంగా "నాయగన్" సినిమాని అల్లుకున్నాడు మణిరత్నం. ఇప్పుడిప్పుడు మనకు పరిచయం అవుతున్న "ధారావి" ఏరియా అనుబంధంగానే కథ నడిపాడు. ఒకరకంగా ఇది కూడా "గాడ్ ఫాదర్" ఫార్ములానే మనమంతా ఉలిక్కిపడే "మాఫియా" కథ. అయితే హీరో ఎప్పుడూ ప్రేక్షకులకు మంచివాడే కాబట్టి ఇక్కడ "వీరయ్య" కూడా మనకు హీరోనే...

ఎక్కడో మరుమూల పల్లెలో ఒక విప్లవకారుని కొడుకు ఈ వీరయ్య తండ్రి ఎన్ కౌంటర్ కళ్ళారా చూసి నగరానికి పారిపోయి వస్తాడు. అక్కడ ఉన్న లోకల్ స్మగ్లర్ హుసేన్ భాయ్. షిప్పుల్లో ఉన్న స్మగుల్ గూడ్స్ ని ఒడ్డుకి చేర్చటం ఈ హుసేన్ భాయ్ పని. అనుకోకుండా ఒకరోజు వీరయ్య ఈ పనికోసం వెళ్తాడు. ఎప్పుడూ ఇచ్చే రెండువందలు కాకుండా రెండువేలు తీసుకుంటాడు. ఫలితం....రెండోరోజు పోలీస్ స్టేషన్ లో శవంగా వేళ్ళాడతాడు హుసెన్ బాయ్. అందర్వరల్డ్ అని చెప్పబడే "నలుగురిని బతికించే పని ఎంత భయంకరమైందో అర్థమవుతుంది వీరయ్యకి. ఇక్కడ బతకటం అంటే చంపటానికి సిద్దపడాలి అన్న విషయం అర్థమవుతుంది. హుసేన్ భాయ్ని లాకప్ దెట్ చేసిన ఇనిస్పెక్టర్ని చంపెస్తాడు.క్రమంగా అక్కడ లోకల్ లీడర్గా ఎదుగుతాడు. అయితే ఇక్కడ దర్శకుడు హీరోని హీరోగానిలబెట్టటానికి అతను ఒక వేశ్యగా ఉన్న అమ్మాయిని పెళ్ళిచేసుకున్నట్టు చూపిస్తాడు. వీరయ్య సెటిల్మెంట్లు మొదలుపెడటాడు. వీరయ్య హోదా, ఇల్లూ, పరపతీ పెరుగుతుంది. ధారావీలో ఉన్న జనాల గుడిసెలు మాత్రం అలాగే ఉంటాయి. అంతా తమకు అన్యాయం జరిగినప్పుడల్లా వీరయ్య సహాయం కోసం వస్తూంటారు.
గాడ్ ఫాదర్ నవల్ లో తనకొడుకుతో ఒక మాట చెప్తాడు. నువ్వు డాన్ గా నిలబడాలి అనుకుంటే నీ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి సహాయం చెయ్యి, అక్కడ ఉన్న మెరికల్లాంటి పిల్లలని చదివించు కొన్ని ఏళ్ళ తర్వాత లాయర్లుగా, డాక్టర్లుగా, పోలీసాఫీసర్లుగా వాళ్ళు మారతారు. అప్పుడు వాళ్ళే నిన్ను ప్రభుత్వం నుంచి కాపాడతారూ అని. ప్రతీ డాన్ అనుసరించిన వ్యూహం అదే అందుకే ఒక లీడర్ గుడిసెల్లోంచే వస్తాడు "కింగ్" అవుతాడు. చుట్టూ ఉన్న జనానికి దేవుడు అవుతాడు కానీ చుట్టూ ఉన్న జనం మాత్రం అలాగే ఉండి పోతారు వాళ్ళకు వచ్చే తాత్కాలిక సంతోషాలకు అతనికి మొక్కుతారు. అప్పుడు అతను చేసే డ్రగ్స్ వ్యాపారం కూడా తప్పుగా అనిపించదు.
ఈ గొడవల్లోనే హార్బర్ మీదపట్టు సాధించటానికి చేసిన ఒక పనివల్ల ఎదురు వర్గం చేసిన దాడిలో తన భార్యనీ కోల్పోతాడు. పిల్లలని వేరే ఊరికి పంపించి చదివిస్తూ ఉంటాడు. ప్రతీ విషయం చెప్పటానికి సమయం అంతగా ఉండదు. త్వరగా సమయం గడిచిపోతుంది ముంబై మాఫియాకి "గాడ్ ఫాదర్" స్థాయి డాన్ అవుతాడు వీరయ్య. మొదట్లో తాను చంపిన ఇన్స్పెక్టర్ కొడుకుకి మతిస్థిమితం లేకపోవటం వల్ల అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లోకి తీసుకోలేదని తెలిసి అతన్ని తన బాడీగార్డ్ గా నియమించుకుంటాడు. పిల్లలు పెద్దవాళ్ళై తిరిగి వస్తారు. ఇదే సందర్భం లో ఒక పోలీస్ అధికరి వచ్చి వీరయ్య సహాయం కోరతాడు. తన కూతురుని చెరిచిన మంత్రుల కొడుకులని యేమీ చెయ్యలేని నిస్సహాయ ఆఫీసర్ పగ తీర్చే పనికి ఒప్పుకున్న వీరయ్య ఆ మంత్రులకొడుకుల కాళ్ళూ చేతులూ విరిచేయిస్తాడు. ఆపని చేయిస్తున్న వీరయ్య కుడిభుజంలాంటి చలమయ్యని చూసిన కూతురు తండ్ర్ని నిలదీస్తుంది. అప్పుడు చెప్తాడు "యే వ్యతిరేక శక్తీ దానంతట అది పుట్టదు" తనని తాను ద్వంసం చేసుకోవటానికే ఈ సమాజం ఒక విలన్ ని స్వయంగా తయారు చేసుకుంటుందన్న విషయం." బహుశా ఈ పాయింట్ కోసమే మణిరత్నం "నాయకన్:" సినిమా తీసాడేమో. తర్వాత వచ్చే మరో గొడవలో కొడుకు కూడా మరణిస్తాడు. ఎంత డాన్ అయినా చచ్చిపోయింది కొడుకు కదా భరించలేడు ఈ సీన్ ఒక్కటి చాలు కమల్ ఎందుకింత గొప్ప నటుడయ్యాడా అనుకోవటానికి....

మొత్తానికి వీరయ్యకి బ్యాడ్ టైం మొదలవుతుంది.కొత్తగా వచ్చిన యంగ్ కమీషనర్ వీరయ్య చేస్తున్న చట్టవ్యతిరేక కార్య కలాపాలకు చెక్ పెట్టాలని చూస్తాడు. అతన్ని బెదిరించటానికి ఇంటికి వెర్ళ్ళిన వీరయ్యకు అక్కడ ఆ కమీషనర్ భార్యగా కూతురు కనిపిస్తుంది. వెనక్కి వచ్చేస్తాడు. వీరయ్య అరెస్టుకోసం ప్రయత్నాలు అధికం కావటం, అతన్ని కాపాడుకోవటానికి మొత్తం ధారావీ ప్రజలంతా విపరీతంగా హింసించబడుతూండటంతో తానే స్వయంగా లొంగిపోతాడు. కోర్టు ముందే గుమిగూడిన వందలమందికీ "వీరయ్య నిర్దోషిగా బయటకు వస్తున్నాడనే మట తెలుస్తుంది... కానీ వీరయ్య బయటికి రాగానే కోర్టుముందే అతన్ని "నా సొంత పోలీస్ అని పెట్టుకున్న పిచ్చి అబ్బాయి కాల్చి చంపేస్తాడు" (మొదట వీరయ్య చంపిన ఇన్స్పెక్టర్ కొడుకు) అలా వరదరాజ మొదళియార్ స్క్రీన్ రూపమైన వీరయ్య నాయుడు కథ ముగిసిపోతుంది. మొత్తం దేశాన్నే ఒక ఊపు ఊపిన అండర్వరల్డ్ డాన్ తన అనుచరుడి చేతిలోనే మరణిస్తాడు. (ఎవరికైనా కబాలి క్లైమాక్స్ గుర్తొస్తే తప్పు నాదికాదు). ఈ సినిమా తర్వాత అండర్వరల్డ్ డాన్ నేపథ్యం లో చాలా సినిమాలే వచ్చాయి. ఒక దశలో ఆర్జీవీ ఇలాంటి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ అయ్యారు. నాగార్జున హీరోగా లారెన్స్ కూడా "డాన్" పేరుతో మాంచి కామెడీ సినిమాకూడా తీసాడు. కానీ ఇప్పటికీ నాయకుడు ఇలాంటి సినిమాల్లో క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రతీ ఫ్రేం నీ తన తరహాలో తీర్చిదిద్దుకోవటం, నటీనటుల పర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం మణిరత్నం ఆలోచనలని మరో మెట్టు ఎక్కించాయి. నిజానికి వీరయ్య మారుతున తీరు మరింత విపులంగా చూపించాలంటే కనీసం ఇంకో గంట నిడివి పెరిగి ఉండేది.. ఇలా ఒక అండర్వరల్డ్ డాన్ ని "హీరోగా" నిలబెట్టేశాడు మణి. నిజానికి ఎవరు హీరో ఎవరు విలన్? చట్ట ప్రకారం చూస్తే వీరయ్య చేసేది తప్పు. స్మగుల్ గూడ్స్ మాత్రమే కాదు మత్తు పదార్థాల సరఫరా కూడా జరిగినప్పుడు మిగతా దేశం లోని యువత ఏమైపోతుందీ అన్న ప్రశ్న వేసుకుంటే ఇలాంటి హీరో నిలబడడు అందుకే అతని చుట్టూ ఉన్న పేద జీవితాలనే చూపిస్తారు. ఆ జనమ వరకూ మాత్రం ఇలాంటి ఒక నయకుడు ఉండాల్సిందే అనిపించకా మానదు. అందుకే సినిమా వరకూ వీరయ్య హీరో. బయట వరదరాజ మొదళియార్ విలన్లా అనిపొఇంచే హీరో అంతే.....

ముప్పయ్యేళ్ళకింద వచ్చిన ఈ సినిమా "మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ ని చూపిస్తుంది. దాదాపుగా ఇండియన్ గాడ్ ఫాదర్ సినిమాలకి ఇదే మొదలు అనుకోవచ్చు. నిజానికి వీరయ్య నాయుడు పాత్రకోసం "శివాజీ గణేషన్"ని అనుకున్నారట. అనుకోకుండా ఆ పాత్ర కమల్ హాసన్ చేతిలో పడింది. సినిమా కథ జరిగే ప్రదేశం "ధారావి" అయినా. కొన్ని ముఖ్యమైన ముంబై సీన్లు తప్ప మిగతా చెన్నైలోని వీనస్ స్టుడియోలో ఉన్న సెట్ లోనే షూట్ చేసారు. 15 రోజుల పాటు జరిగిన టేస్ట్ షూట్ ఫొటోల ఆధారంగా ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వీనస్ స్టూడియోలో అచ్చుగుద్దినట్టు ఆ సెట్ తయారుచేసాడు. అఖరికి వందలకొద్దీ పవురాలని కూడా తెప్పించారట సహజత్వం కొసం. (అందుకే 60 లక్షల బడ్జెట్ కాస్తా కోటి దాటింది). స్క్రీన్ ప్లే రాసుకోవటం ఇంత వీజీనా అనిపించేంత సాఫీగా కనిపిస్తుంది. కానీ అప్పటికి అది సరైన పద్దతే అనిపిస్తుంది. నిజజీవిత ఘటనల ఆధారంగా అల్లుకున్న కథనే కాబట్టి పెద్ద మలుపులు ఏమీలేనట్టుగానే అనిపించినా. మణిరత్నం మేకింగ్ సినిమాని క్లాసిక్ గా నిలబెట్టింది . ఒకే పాత్ర అయినా నాలుగు రకాల గెటప్పుల్లో కనిపించే కమల్ హసన్ ప్రతీ గెటప్ కీ సరిగ్గా సరిపోతాడు. అయితే ఇలాంతి పాత్రలకి మణి ఒక మూస పద్దతి మేకప్ వాడతాడు. మధ్య వయసు రాగానే హీరో జుట్టు పూర్తిగా వెనక్కి దువ్వి లావు ఫ్రేమున్న కళ్ళద్దాలు పెట్టేస్తాడు. ఇద్దరు లో ప్రకాష్ రాజ్, గురు లో అభిషేక్ బచ్చన్ కూడా ఇదే తరహా గెటప్ లో కనిపించటం గమనించొచ్చు....

 

                                                                                                                                                             సూఫీ