దేశ సైనికులు 43 మంది మృతి: పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్న సిద్ధూపై మండిపడుతున్న నేటిజన్లు....

12:51 - February 16, 2019

పుల్వామా ఉగ్ర‌దాడిపై స్పందిస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసిన భార‌త మాజీ క్రికెట‌ర్‌, పంజాబ్ మంత్రి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సిద్ధూ పాల్గొంటున్న' ది క‌పిల్ శ‌ర్మ‌' షోను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చరిస్తున్నారు. ' ది క‌పిల్ శ‌ర్మ' షోను బ‌హిష్క‌రించండి, సిద్ధును బ‌హిష్క‌రించండి, సోనీటీవీని బ‌హిష్క‌రించండి అంటూ సోష‌ల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. ' ది క‌పిల్ శ‌ర్మ షోను చూడ‌క‌పోవ‌డ‌మే అమ‌ర జవాన్ల‌కు అర్పించే నిజ‌మైన నివాళి' , 'దేశ సైనికులు 43 మంది ప్రాణాలు కోల్పోతే.. సిగ్గు లేకుండా పాకిస్తాన్‌కు వ‌త్తాసు ప‌లుకుతావా' , ' సోనీటీవీకి ఏమాత్రం దేశ‌భ‌క్తి ఉన్నా వెంట‌నే సిద్ధును నిషేధించాలి' అంటూ నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే జవాన్ల మృతిపై అసలు సిద్ధూ ఏమన్నారో చూస్తే...' పుల్వామా దాడి గురించి సిద్ధూ స్పందిస్తూ.. ' ఉగ్ర‌వాదానికి జాతి, మ‌తం ఉండదు. కొంత మంది కోసం దేశం మొత్తాన్ని నిందిస్తారా? ఈ హింస‌కు పాల్ప‌డిన వారిని శిక్షించాల్సిందే. అయితే ఈ పేరుతో ఒక దేశం మొత్తాన్ని నిందించ‌కూడ‌దు. అన్ని దేశాల్లోనూ చెడ్డ‌వారు, మంచివారు ఉంటారు' అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్టుగా ఉండ‌డంతో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. గ‌తంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకున్న‌ప్పుడుపాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైన‌పుడు కూడా సిద్ధుపై ఇదే త‌ర‌హాలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.