మోడీ ఎవరు? ఆరు నెలల తరువాత చూడండి: ప్రకాశ్‌ రాజ్‌

13:17 - January 19, 2019

దాదాపు ఐదు భాషల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. రీల్‌ జీవితంలో విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రకాశ్‌రాజ్‌.. ఇక రియల్‌ జీవితంలో రాజకీయ పాత్రను పరీక్షించుకోనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించిన ఆయన పొలిటికల్‌ జీవితంలో విజయంకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియాకు  ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మోడీపై ప్రకాశ్‌రాజ్‌ చేసిన విమర్శలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  'నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రధానమంత్రి మోడీపై వ్యతిరేకతతోకాదు. ఆయన ఎవరు? ఆరునెలల తర్వాత చూడండి.. ఆయన కేవలం ఒక ఎంపీగా ఉంటారు' అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయనను గౌరవించాను. మార్పు తెస్తారని ఆశించాను. కానీ, ఉద్యోగాలపై ఆయన చేసిన వాగ్దానం ఏమైంది? వ్యవసాయ సంక్షోభంపై చేసిందేమిటి? పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమిటి? జీఎస్టీ అమలు ప్రణాళిక సరిగాలేదని అప్పుడే చెప్పాం.. జీఎస్టీని దాదాపు 200 సార్లు మార్పులు చేశారు' అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 'బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నది. మాకు శాస్త్రీయ కోణంలో పరిష్కారాలు కావాలి.  'మరో 50 ఏండ్లు అధికారం మాదేనని వారు (బీజేపీ) అహంకారపూరిత వ్యాఖ్యలుచేస్తున్నారు. అది నిర్ణయించేంది దేశ పౌరులు మాత్రమే అని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. 

'రైతులకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది. శీతలగిడ్డంగులు, వ్యవసాయ కాలనీలను ఎందుకు ప్రవేశపెట్టడంలేదు?' అని ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. 'వ్యవసాయ సంక్షోభం కేవలం వ్యవసాయం, నీళ్లు, వర్షం తదితరాలకు సంబంధించినది మాత్రమే కాదు.. రైతులు విద్య, వైద్యం తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధి నేడు ప్రధాన సమస్యగా ఉన్నది' అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. 

బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. వరుసగా మూడుసార్లు ఈ స్థానంలో బీజేపీ విజయం సాధిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌ పోటీచేస్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. బెంగుళూరు సెంట్రల్‌లో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఇలా పలు భాషలు మాట్లాడే ప్రజలున్నారు. అలాగే ముస్లింలు కూడా గుర్తించదగిన స్థాయిలో వున్నారు. 'బెంగళూరు సెంట్రల్‌ మినీ ఇండియాలాంటిది. ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, హిందువులతోపాటు... కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఉన్నారు. అందుకే నేను ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నాను' అన్నారు.