పీఎంఎఫ్‌బీవై పథకం రైతుల కోసమా?...ఇన్సూరెన్స్‌ కంపెనీల కోసమా?..

12:10 - December 29, 2018

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం రైతులకు ఎంత మేలు చేస్తోందనేది పక్కన బెడితే.. ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతున్నది. ఇటు రైతులు, అటు సర్కారు చెల్లించే ప్రీమియంలో కొద్ది మొత్తంలోనే బీమా చెల్లిస్తూ మిగిలిందంతా స్వాహా చేస్తున్నాయి. 2016 ఫిబ్రవరిలో పీఎంఎఫ్‌బీవై పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటివరకు రైతులు, కేంద్రం నుంచి దాదాపు రూ.42,114 కోట్లు ప్రీమియం రూపంలో 18 బీమా కంపెనీలకు అందాయి. కానీ, పంటల నష్టానికి ఆ కంపెనీలు చెల్లించిన బీమా మొత్తం రూ.32,912 కోట్లు మాత్రమే. మిగిలిన 8,713 కోట్లు(21 శాతం ప్రీమియం) కంపెనీలకు మిగుల్లేనన్నమాట. కేంద్రప్రభుత్వమే స్వయంగా పంటల బీమా చెల్లించాల్సింది పోయి.. ప్రయివేటు కంపెనీలకు ఆ బాధ్యతను కట్టబెట్టి వాటికే దోచి పెడుతున్నదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వరుస పథకాల్లో అత్యంత హానికరమైనది ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై). రైతుల పంటకు బీమా కల్పించడం ఈ పథక ఉద్దేశం. అంటే ప్రకృతి విపత్తులతో పాటు, నిరోధించలేని కారణావల్ల పంటకు నష్టంవాటిల్లితే.. రైతులకు ఆ నష్టాన్ని భర్తీ చేస్తారు. పథక ఉద్దేశం ఉన్నతమైనది. మన దేశంలో వ్యవసాయం వర్షాధారితమైనది కనుక విపత్తుల సమయంలో అన్నదాతలను తప్పనిసరిగా ఆదుకోవాల్సిందే. మరి మోడీ ప్రభుత్వం చేసిందేమిటి..? రైతుల నష్టాన్ని, బాధను పెద్ద సంస్థలకు లాభాలు సంపాదించే వ్యాపారంగా మార్చింది. దేశం లో బాగా స్థిరపడిన 'ఇన్సూరెన్స్‌ యంగ్రాంగాన్ని' మోడీ ప్రభుత్వం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నది. నష్టాలను రైతులకు సూటిగా చెల్లించాల్సిన ప్రభుత్వం ఆ డబ్బును పరిహారం చెల్లించే సంస్థలకు అప్పగించడంతో ఆ సంస్థలకు అపారమైన లాభాలు చేకూరాయి. అంతేకాదు  నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యమవుతుందన్న ఫిర్య్దాదులు పీఎంఎఫ్‌బీవై పథకం ప్రారంభం నుంచి విస్తృతంగా వచ్చాయి. మూడు నుంచి నాలుగు నెలల ఆలస్యం సర్వసాధారణమైంది. అసలే నష్టాల్లో ఉన్న రైతులు ఈ విప్తత్తు తర్వాత మరో పంట తక్షణమే ప్రారంభించడానికి డబ్బు అవసరం. దీంతో వారు ప్రయి వేటు రుణదాతల వద్ద అధికవడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. వడ్డీలకు వడ్డీలు కడుతూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఈ పథకం ప్రారంభించిన మూడేండ్ల తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. తక్కువ పరిహారం.. చెల్లింపులో ఆలస్యం, పరిహారం కోసం కంపెనీ చుట్టూ తిరగడం పీఎంఎఫ్‌బీవైతో రైతులు విసిగిపోయా రు. పథకం తొలిసాళ్లలో అంటే 2016 ఖరీఫ్‌లో 4 కోట్లమంది రైతులతో ఈ బీమా పథకం ప్రారంభమైంది. 2017 కరీఫ్‌నాటికి 3.47 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో ఖరీఫ్‌ సీజన్లో తాత్కాలికంగా 3.33 కోట్లను అంచనా వేశారు. అంటే ప్రారంభంనాటితో పోలిస్తే 17శాతం తగ్గారు. రైతులు కష్టార్జితాన్ని, పకృతివిపత్తులు, చీడపీడల దాడుల వల్ల నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వ నిధులను బీమా కంపెనీలకు కట్టబెట్టే .పెద్దకుట్రగా మారింది. ఇలాంటి నష్టాలకు రైతులకు పరిహారం చెల్లించడం సమాజం బాధ్యత. ఎన్నికైన ప్రభుత్వాలు ఈ బాధ్యతను నేరుగా తీసుకోవా లి. రైతుల దుస్థితిని ఆసరాగా చేసుకొని కోట్లాది రూపాయలను అప్పనంగా అందించడం ద్వారా దేశాన్ని నడించాలనే మోడీ ఆలో చన అనైతికమైంది. పీఎంఎఫ్‌బీవైని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఒక బలమైన ప్రభుత్వ పరిహార వ్యవస్థను ఏర్పాటుచేయాలి.