నరేంద్ర మోడీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

16:23 - December 29, 2018

నేనొక ఛాయ్ వాలా అని.. అతి సామాన్యుడినని ప్రొజెక్ట్ చేసుకుని దేశంలో కోట్లాది మందికి చేరువయ్యడు నరేంద్ర మోడీ. మీలో ఒకడిని.. మీలాంటి వాడిని.. నన్ను ప్రధానిని చేయండని అభ్యర్థించాడు. కానీ అధికారంలోకి వచ్చాక కానీ తెలియలేదు మోడీలోని కొత్త కోణాలు. విపరీతమైన ఆయన ప్రచార పిచ్చిని.. ఢాంబికాల్ని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. పూటకో సూటు మార్చడం.. ప్రచారం కోసం తహతహలాడటం.. చేతలు తగ్గించి మాటలతో కాలక్షేపం చేయడం.. ఇక్కడ చక్కదిద్దాల్సిన పనులు విడిచిపెట్టి అదే పనిగా విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఇలాంటి లక్షణాలన్నీ మోడీ మీద జనాలకు వెగటు పుట్టేలా చేశాయి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో మోడీ చేసిన విదేశీ పర్యటనలన్నింటికీ కలిపి ఏకంగా రూ.2021 కోట్ల ఖర్చు కావడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం మంత్రి వీకే సింగే పార్లమెంటుకు తెలియజేశారు. 2014లో జూన్లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి తను చేసిన చివరి విదేశీ పర్యటన వరకు విమాన ఛార్జీలు.. మెయింటెనెన్స్.. హాట్లైన్ సదుపాయం వీటన్నిటికీ అయిన ఖర్చు అక్షరాలా రూ. 2021 కోట్లు అని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి  వీకే సింగ్ సభకు తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రధానీ విదేశీ పర్యటనల కోసం ఇంత దుబారా చేయలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాను సామాన్యుడినని.. ఛాయ్ వాలా అని.. మీలో ఒకడినని మోడీ ఏ మొహంతో చెప్పుకుంటాడో చూడాలి.