మోడీని దేశ ప్రజలు తిరస్కరించనున్నారా...?

12:01 - January 25, 2019

ఐదేళ్లకే మోడీ మేజిక్ మాయం కానుందా? దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ వమ్ము చేశారా?  మోడీని.. దేశ ప్రజలు త్వరలో తిరస్కరిస్తున్నారా? అంటే అవునన్న మాటను తాజాగా వెల్లడించిన రెండు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలుగా పేరున్న ఇండియా టుడే.. కార్వీ - ఏబీపీ-సీఓటర్ సంస్థలు కలిసి నిర్వహించిన సర్వే ఫలితాల్ని వెల్లడించారు. ఆ సంస్థలు వెల్లడించినదాని ప్రకారం... మోడీని దేశ ప్రజలు రిజెక్ట్ చేయటమే కాదు.. ఒకవేళ కేసీఆర్.. నవీన్ పట్నాయక్.. జగన్.. పళనిస్వామి లాంటి వారు తమ పూర్తి మద్దతును ప్రకటించినా ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావటం సాధ్యం కాదని తేలింది.  ఈసారి హంగ్ మూడ్ తప్పదన్న విషయాన్ని వెల్లడించింది. మోడీ మీద పెరిగిన వ్యతిరేకత కమలం పార్టీ కొంప ముంచటం ఖాయమని.. భారీగా సీట్లనునష్టపోనుందని పేర్కొంది.  ఒకవేళ.. మాయవతి.. అఖిలేశ్.. మమతా బెనర్జీలు కానీ యూపీఏకు మద్దతు ఇస్తే మాత్రం యూపీఏ సర్కారు పవర్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సర్వే చేసిన రెండు సంస్థలు ఏం చెప్పాయన్న విషయంలోకి వెళితే.. దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో 13179 మందిని సర్వే చేసి ఫలితాల్ని విడుదల చేశారు. ఇక.. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో మాత్రం బీజేపీకి 237 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. బీజేపీకి ఇంత భారీ నష్టం జరగటానికి కారణం 2014లో పోలిస్తే ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 99 స్థానాల్లో ఓటమి చెందటం ఖాయమని చెబుతున్నారు. 2014లో కేవలం 60 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకున్న యూపీఏ ఈసారి మాత్రం తన బలాన్ని 166కు పెంచుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి.  మోడీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే.. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం మద్దతు ఇచ్చినా ఒక్క స్థానం తేడాతో మేజిక్ మార్క్ కు దూరంగా ఉంటుందని చెబుతున్నారు. యూపీఏ 33 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే ఎన్డీయే మాత్రం 35 శాతం ఓట్లను దక్కించుకున్నా పవర్ మాత్రం అందని ద్రాక్షగా మిగులుతుందని స్పష్టం చేస్తున్నారు.