తెలంగాణాలో మరో రెండు కొత్త జిల్లాలు : ములుగు, నారాయణ పేట

20:01 - February 16, 2019

 *తెలంగాణలో 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు

*తెలంగాణలో 33 కు పెరిగిన జిల్లాల సంఖ్య 

*ములుగు, నారాయణ్‌పేట జిల్లాలకు గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

 

 తెలంగాణలో 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ్‌పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నారాయణ్‌పేట, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఇవాళ విడుదల చేసింది. దీంతో రేపట్నుంచి నారాయణ్‌పేట, ములుగు కొత్త జిల్లాలుగా మనుగడలోకి రానున్నాయి.

నిజానికి ములుగు జిల్లా ఏర్పాటుకు సంబంధించి జనవరి నాలుగో తేదీనే మొదటి అడుగు పడింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. ఫారం నెంబర్‌ 1 ప్రకటనను ములుగు ఆర్డీవో రమాదేవి పర్యవేక్షణలో ప్రతులను నోటీసు బోర్డుపై అంటించారు. రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మండల కార్యాలయాల్లో ప్రతులను ప్రదర్శిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

జిల్లాల ఏర్పాటు చట్టం 3లోని సబ్‌ సెక్షన్‌ 5 కింద ప్రభుత్వం ఆయా ప్రాంతాల ఉత్తమ పరిపాలన, అభివృద్ధి నిమిత్తం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా ఏర్పాటుకు సంకల్పించిందని, దీనిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని నోటీస్‌లో పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది.

ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక సారక్క),  ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు  కొత్తగా ఏర్పడిన ములుగు  జిల్లా పరిధిలోకి రానున్నాయి. నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూరు, ఉట్కూర్‌, నర్వ, మక్తల్‌, మాగనూరు, కృష్ణా మండలాలు నారాయణపేట పరిధిలోకి  రానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.