పెళ్లి పత్రిక ఒక్కటీ 1.5 లక్షలు : పేదవాడి కళ్ళు తిరిగేలా అంబానిల పెళ్లి ఏర్పాట్లు

23:58 - February 14, 2019

 

 

 

 

 

 

 

 

డబ్బున్న వాడి ఇంటి కుక్క మొరుగుడు కూడా సింహం గర్జన లా ఉంటుంది అని ఒక చైనా సామెత. ఇప్పుడు భారత దేశ కుభేరుల పెళ్ళి ఏర్పాట్లు చూస్తూంటే అలానే అనిపిస్తోంది. ఒక పెళ్ళి కార్డుకోసం ఒక్కొక్కటీ లక్షల ఖరీదైన ఆహ్వాన పత్రికలు చూస్తూంటే అసలు మన దేశంలో పేదరికం ఉందా అన్న అనుమానం కలగక మానదు. ఒకటిన్నర సంవత్సరం కిందట "ఐరన్ కింగ్" గాలి జనార్థన రెడ్ది కూతురు పెళ్ళికోసం తయారు చేయించిన పెళ్ళి ఆహ్వాన పత్రిక చూసారు కదా అది ఒక్కొక్కటీ మూడులక్షలకు పైనే అని ఆశ్చర్యంగా మాట్లాడుకున్నాం. 


   ఇప్పుడు మళ్ళీ అలాంటిదే మరో వివాహ పత్రిక ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీ కుమార్తె ఈషా‌కు పిరమల్ ఆనంద్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కార్పోరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జరిపించారు అంబానీ. కూతురు పెళ్లినే అంత వైభవంగా చేసిన అంబానీ.. ఇప్పుడు కొడుకు వివాహాన్ని ఎంత ఘనంగా చేస్తాడో చెప్పక్కర్లేదు. ముఖేష్ అంబానీ కూతురు ఇశా వివాహ వేడుకలను జనం మరువక ముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది. అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ పెళ్లి, ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మోహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చిన 9న జరగనుంది.


ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి దేశంలోని ప్రముఖులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరౌతున్నారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఆకాశ్ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని చూస్తే వావ్ అనాల్సిందే.   


వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉటుందో‌ చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంబానీల రేంజ్‌కు తగినట్లే ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఒక్కో శుభలేఖకు ఏకంగా 1.5 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.  బోర్డ్ గేమ్ సైజులో బాక్స్, యానిమేటెడ్ రొటేటింగ్ డిస్క్, తాకగానే వెలిగే లైట్లు, శ్రీకృష్ణ, రాధల చిత్రం, వినాయకుడి ఎంబోజింగ్ ప్రతిమ ..ఇలా వెడ్డింగ్ కార్డు ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది.

ప్రముఖ డిజైనర్ల చేత గ్రాండ్‌గా తయారు చేసిన ఈ వెడ్డింగ్ కార్డులో ముఖేశ్-నీతా అంబానీలు స్వహస్తాలతో రాసిన లేఖ మొదట దర్శనిమిస్తుంది. ఆ తర్వాత సంగీత్, మెహంది, పెళ్లి వేదిక, అతిథులకు ఇచ్చే బహుమతులు వివరాలు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు వెడ్డింగ్ కార్డు తెరవగానే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటాయి. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.