మహిళా బిల్లు విషం లోనూ ఇదే స్పీడ్ చూపించండి

16:17 - January 10, 2019

ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌కులాల వారికి ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ప్ర‌వేశ‌పెట్టిన ఈబీసీ బిల్లు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్య సభలోనూ వెంట వెంటనే ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఒక్కరోజులోనే ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే ఎటువంటి వ్యతిరేకతా లేకుండా వెను వెంటనే ఆమోదం పొందింది. ఇక ఈ ప్రాసెస్ ని చూసి మగాడు మోడీ అన్న స్థాయిలో హెడ్డింగులు వచ్చాయి ప్రముఖ పేపర్లలో. 


   అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ అనగానే ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు కూడా స్వాగ‌తించారు. అయితే అంతే వేగంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును కూడా పార్ల‌మెంట్ ఆమోదించాల‌ని ఇవాళ టీఆర్ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. ఈబీసీ బిల్లును ఎంత వేగంగా పాస్ చేశారో. అంతే స్పీడ్‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదిస్తే. దేశం నిజంగానే ప్రగ‌తి సాధిస్తుంద‌ని ఆమె అన్నారు. 

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు పార్ల‌మెంట్‌లో ఆమోదం ద‌క్కాలంటే, దానికి బ‌ల‌మైన రాజ‌కీయ సంక‌ల్పం ఉండాల‌ని ఎంపీ క‌విత తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో పార్ల‌మెంట్ లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అయితే ఆ బిల్లు రాజ్య‌స‌భ‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉన్న‌ది. 

మహిళా రిజర్వేషన్‌ బిల్లు మొదటిసారిగా 1996లో దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైంది. తరవాత కాలంలో 1998, 1999, 2002, 2003లో ఈ బిల్లును పునఃప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం మాత్రం పొందలేకపోయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ ఇతర పార్టీల స్పందన సరిగా లేకపోవడంతో బిల్లు ముందుకు వెళ్లలేకపోయింది. మొదటి బిల్లు ప్రవేశపెట్టిన 1996కు సరిగ్గా 12 సంవత్సరాల తరవాత 2008లో బడ్జెట్‌ సమావేశాల్లో మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది.

          రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో 2/3వ వంతు మెజారిటీ ఈ బిల్లుకు అవసరం. తరవాత బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిషన్‌ అభిప్రాయానికి పంపగా వారు కూడా తమ నివేదికలో బిల్లు ఆమోదం పొందాలని పేర్కొన్నారు. తరవాత 2010 మార్చిలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో ఓటింగ్‌కు రాలేదు. 15వ లోక్‌సభ 2014లో రద్దు కావడంతో ఈ బిల్లు వీగిపోయింది.

బిల్లు 2008లో లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆర్‌జెడి ఎంపి ఒకరు బిల్లు పత్రాలను చించివేయగా, రిజర్వేషన్‌ కల్పించిన 33% ఓబీసీలకు విడిగా రిజర్వేషన్‌ కల్పించాలని సమాజ్‌వాది ఎంపిలు నిరసనకు దిగారు. 2008లో అధికార యుపిఎకి చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌, రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్‌ పాటిల్‌ సహా మహిళా సభ్యుల సంఖ్య కూడా గత సభలతో పోలిస్తే ఎక్కువే. అటువంటి పరిస్థితుల్లోనే బిల్లు ఆమోదం పొందలేదు.