దీపికా పేరు, కాజ‌ల్ ఫోటో: రాజమండ్రి ఓటర్ లిస్టులో విచిత్రాలు

12:41 - March 23, 2019

*ఓట‌ర్ జాబితా లిస్ట్‌లో సినీ తారల ఫోటోలు

*దీపికా పదుకునేకి ఓటు, ఫోటో లో మాత్రం కాజల్ 

*రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో 

 

ఎన్నికల సమయం దగ్గర పడిందంటే చాలు అటుపార్టీల ప్రచారాలూ, అభ్యర్థుల వాగ్దానాలూ లాంటివన్నీ ఒక ఎత్తైతే మన ఓటర్ లిస్టుల్లో జరిగే అవకతవతలు ఒకెత్తు. ఒక పక్క వందల ఓట్లు మాయమైపోతున్నాయని, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లుగల్లంతవుతున్నాయనీ గోల జరుగుతూంటే ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కి ఆంద్రప్రదేశ్లో ఓటు ఇచ్చారు. పాపం ఆమె తండ్రిపేరు మాత్రం ప్రకాశ్ పదుకునే అని కాకుండా రమేష్ కొండా అని ఇంకెవరి పేరో ఇచ్చేసారు.

ఓట‌ర్ జాబితా లిస్ట్‌లో సినీ తారల ఫోటోలు ప్ర‌త్యక్షం కావ‌డం లేదంటే ఒక‌రి పేరుతో మ‌రొక‌రి ఫోటో ప్ర‌త్య‌క్షం కావ‌డం మ‌నం గ‌తంలో చాలానే చూసాం. రామాయణంలోని హనుమంతునికీ, శ్రీకృష్ణుడికీ కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చిన ఘటనలుకూడా యూపీలో, హర్యాణాలో జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోతో పద్మావతి అనే మహిళకు ఓటు హక్కు ఇచ్చిన విష‌యం విదిత‌మే.   

వివ‌రాల‌లోకి వెళితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా ప‌దుకొణే పేరుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో ప్ర‌త్య‌క్షం అయింది. దీపికా ప‌దుకొణే తండ్రి పేరు ర‌మేష్ కొండా అని ఆమె వ‌య‌స్సు 22 అని ప్రింట్ చేశారు. ఇంటి పేరు కూడా ఆ లిస్ట్ లో ముద్రించ‌డంతో ఎన్నిక‌ల అధికార్లు ఎంత సక్ర‌మంగా ప‌నులు చేస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది అని ఓట‌ర్లు మండిప‌డుతున్నారు.

అయితే దీపిక మీద ఇష్టంతో ఆ రమేష్కొండా అనే ఆయణ ఆ పేరుపెట్టుకొని ఉండవచ్చుకదా ఎందుకు ముందే అధికారులని ఆడిపోసుకోవటం అనుకోవటానికీ చాన్స్ ఉంది కానీ ఆపేరు పక్కనే ఉండాల్సిన ఫొటోల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫొటో పెట్టిమరీ ఓటరులిస్ట్ లో నమోదు చేసారు. ప్ర‌స్తుతం దీపికా పేరుతో ఉన్న కాజ‌ల్ ఫోటోకి సంబంధించిన ప‌త్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.