మధ్యహ్న భోజనం: కిచిడీలో నాగుపాము

14:48 - February 1, 2019

ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన భోజనంలో చనిపోయిన పాము కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 80మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. అందరూ 1నుంచి 5 తరగతుల లోపువారే. బుధవారం మధ్యాహ్నం విద్యార్ధుల కోసం వండిన ' కిచిడీ 'ని వడ్డించేందుకు సిబ్బంది ఉపక్రమించారు. పాత్ర తెరవగానే అందులో చనిపోయిన నాగుపాము కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వడ్డించడం నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మధ్యాహ్న భోజనంలో పాము కనిపించిన మాట వాస్తవమేననీ, దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నాందేడ్ డీఈవో ప్రశాంత్ దిగ్రాస్కర్ పేర్కొన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సిద్ధంచేసే కాంట్రాక్టును పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ స్థానిక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించిందని ఆయన తెలిపారు.