' మీ టూ ఒక స్క్రాప్‌ ': షావుకారు జానకీ

11:01 - December 31, 2018

ఏడాదిగా దేశవ్యాప్తంగా ‘మీ టూ’ మూమెంట్ ఉద్ధృతంగా నడుస్తోంది. సినీ పరిశ్రమలతో పాటు వివిధ రంగాల నుంచి మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరిగిన అఘాయిత్యాల గురించి వెల్లడించారు. వేరే ఉద్దేశాలతో.. ప్రచారం కోసం ‘మీ టూ’ను వాడుకుని ఉండొచ్చు. కానీ ఈ మూమెంటే తప్పు అనడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆరోపణలు చేసిన వాళ్లను తప్పుబట్టడం అన్యాయం. ఐతే సీనియర్ నటి షావుకారు జానకి ఇదే పని చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ‘మీ టూ’ మూమెంట్ ను ఆమె దుయ్యబట్టారు. ‘మీ టూ ఒక స్క్రాప్’ అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. హాలీవుడ్లో.. బాలీవుడ్లో ‘మీ టూ’ నడుస్తుండటం చూసి దక్షిణాదిన కూడా చాలామంది అమ్మాయిలు ఎప్పటెప్పటి ఉదంతాల్నో తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారని షావుకారు జానకి అన్నారు. గతంలో తమ ప్రయోజనాల కోసం అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ‘మీ టూ’ వచ్చింది కదా అని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. కొందరు జరగని విషయాల్ని కూడా జరిగినట్లు నమ్మిస్తున్నారన్నారు. అమ్మాయిలు ఇలా బయటికొచ్చి ఆరోపణలు చేయడం వల్ల ఏం సాధిస్తున్నారంటూ చిత్రమైన ప్రశ్న వేసింది జానకి. దీని వల్ల భర్త.. పిల్లలు.. ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బంది కదా అని ప్రశ్నించారు. కొందరి ఆరోపణలు తప్పు అంటే ఓకే కానీ.. మొత్తంగా ‘మీ టూ’ మూమెంటే తప్పని.. ఎవ్వరూ గొంతు విప్పొద్దని అంటే ఎలా? అందుకే జానకిపై చిన్మయి సహా అందరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.