అభివృద్ధి అడిగితే వాడిన కండోమ్ లు పంపారు: ఆర్టీఐ అధికారుల సమాధానం దారుణం

05:15 - January 16, 2019

గత పద్దెనిమిదేళ్ళుగా తమ గ్రామంలో జరిగిన అభివృద్దిపనులు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు. 2001 సంవత్సరం నుంచీ ఇప్పటివరకూ తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి పథకాలు ఏంటో చెప్పాలంటూ ఆర్టీఐ చట్టం ద్వారా ప్రశ్నించిన ఇద్దరు వ్యక్తులకు అధికారులు రెండు పార్శిళ్ళు పంపించారు. సమాధానంగా పత్రాలు వస్తాయనుకుంటే అలా పర్సెల్ రావటంతో కాస్త ఆశ్చర్యంగానే ఆ కవర్ విప్పి చూసి నిర్ఘాంత పోయారు ఆ ఇద్దరువ్యక్తులు. ఎందుకంటే సమాధానంగా అధికారులు వాళ్ళకు వాడేసిన కండోములు పంపారు.  రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. 


భద్ర తహశీల్‌లోని చానీ బడి గ్రామానికి చెందిన వికాశ్ చౌదరీ, మనోహర్‌లాల్‌లు గతేడాది ఏప్రిల్ 16న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేర్వేరుగా దరఖాస్తు చేస్తూ 2001 నుంచి ఇప్పటి వరకు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరాలు కావాలని కోరారు.వీరి ప్రశ్నలకు సమాధానంగా ఈ మధ్యనే అధికారులనుంచి ఇద్దరికీ రెండు పార్శిళ్లు అందాయి.

 

అందులో ఓ కవర్‌ను విప్పి చూడగా అందులో పాత దినపత్రికలో వాడి పడేసిన కండోములు దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కైన విశాల్ రెండో దానిని దానిని విప్పకుండా బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి (బీడీవో)ను పిలిపించి మనోహర్ లాల్ కి వచ్చిన కవర్ ని గ్రామ పెద్దల ముందు కోరాడు. అయితే, బీడీవో అందుకు అంగీకరించకపోవడంతో గ్రామంలోని కొందరు ముఖ్యుల సమక్షంలో వీడియో తీస్తూ రెండో కవర్‌ను విప్పారు. 


   ఈ కవర్లో కూడా  మొదటి కవర్‌లో ఉన్నట్టుగానే న్యూస్ పేపర్‌లో వాడిపడేసిన కండోములు చుట్టి పంపించారు. సమాచారం అడిగితే వచ్చిన ఈ విచిత్ర సమాధానానికి  లాల్ కూడా ఆశ్చర్యపోయాడు. ప్రజాప్రతినిధులు ఇలాంటి సమాధానం ఇస్తారని తాను ఊహించలేకపోయానని లాల్, ఈ 
 తరహా అవహేళన చేసేలా ఉన్న కవర్లు అందుకున్న తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైనట్టు వాపోయాడు. కండోముల విషయమై హనుమాన్‌గఢ్ జిల్లా పరిషత్ సీఈవో నవ్‌నీత్ కుమార్‌ను సంప్రదించగా దీనిని దురదృష్టకరమైన చర్యగా పేర్కొన్నారు. ఎవరో కావాలనే ఈ పనిచేసి ఉంటారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.