ఐసీయూలొ ఉన్న పేషెంట్ మీద సామూహిక అత్యాచారం: నిందితుల్లో ఒకరు డాక్టర్

13:55 - March 25, 2019

*ఉత్తర ప్రదేశ్, మీరట్ లో దారుణం 

* ఐసియూలో చికిత్సపొందుతున్న మహిళపై అత్యాచారం 

*ముగ్గురు రేపిస్టుల్లో ఒకరు డాక్టరు, పోలీసుల అదుపులో నిందితులు 

 

 

ఇంట్లో,బడిలో, గుడిలో, పదిమందీ తిరిగే బస్టాండుల్లో, రైళ్ళలో అసలు అత్యాచారం జరగని చోటంటూ ఉండటం లేదు. రోజుకి పదుల సంఖ్యలో స్త్రీలమీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. వయసు తేడా చూడకుండా నెలల పసి బిడ్డలనుండీ,  కదలలేని ముసలివాళ్ళ వరకూ భయపడుతూనే ఉండాల్సి వస్తోంది. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణమైన సంఘటన చోటు  చేసుకుంది.

మీరట్‌లోని ఒక ప్రయివేటు హాస్పిటల్‌లో ఐసియూలో చికిత్సపొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మత్తు ఇంజక్షన్‌  ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపింది.  నిందితుల్లో ఒక డాక్టరు ఉండటం  మరింత ఆందోళన కలిగిస్తోంది.  శనివారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శ్వాస సంబంధమైన ఇబ్బందులతో బాధిత మహిళ ఆసుపత్రిలో చేరారు.

అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమెకు మరింత జాగ్రత్తగా చికిత్స అందించాల్సిన సిబ్బంది ముగ్గురు ఆమెపై దురాగతానికి పాల్పడ్డారు. స్పృహలోనికి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తన భార్యకు ఓ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి. ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి భర్త ఆరోపించారు. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలోని సీసీకెమేరాలు ఆఫ్ చేసి ఉన్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు స్టాఫ్‌ని అదుపులోకి తీసుకున్నారు.