నుమాయిష్ అగ్ని ప్రమాద కారణాలెఅమిటి?: పోలీసుల దర్యాప్తు

11:20 - January 31, 2019

నాంపల్లి నుమాయిష్ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్లక్ష్యం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని, లక్షలాది రూపాయయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నష్టపోయిన వారికి ఎక్జిబిషన్ నిర్వాహకులు కనీసం మంచి నీళ్లు అందించకపోవడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్జిబిషన్ సొసైటీలో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంటలకు తగలబడి పోయిన స్టాల్స్ చూస్తూ గుజరాత్ ,రాజస్థాన్ స్టాల్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు.

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటలకు మొదలైన అగ్నికీలలు.. పదిన్నరవరకు కొనసాగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 స్టాళ్లు ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సకాలంలో స్పందించి, పెను ముప్పును తప్పించాయి. నింగికి ఎగసిపడుతున్న మంటలను 20కిపైగా ఫైరింజన్లు శ్రమించి అర్పివేశాయి. దాదాపు 60 వాటర్‌ట్యాంకర్లు ఫైరింజన్లకు ఎప్పటికప్పుడు నీటిని సరఫరాచేశాయి. 
  
నిన్న(బుధవారం)ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోని మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుకు చెందిన స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో రాజుకున్న మంటలు పెను విధ్వంసం సృష్టించాయి. ఒకదాని తర్వాత మరొకటిగా దాదాపు 150 దుకాణాలను మంటలు కబళించాయి. అయితే.. మంటలు వ్యాపించడం మొదలుకాగానే సందర్శకులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలకు గాలులు తోడవడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు ఇతర స్టాళ్లను చుట్టుముట్టాయి.

విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను అప్రమత్తం చేసి, ప్రమాద తీవ్రత తగ్గించేందుకు కృషిచేశారు. హోంమంత్రి మహమూద్‌అలీ, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఎగ్జిబిషన్‌లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు కూడా స్టాళ్లను ఏర్పాటుచేశారు. వారంతా భోజన సదుపాయంకోసం తెచ్చుకున్న గ్యాస్‌సిలిండర్లను స్టాళ్లల్లోనే ఉంచడంవల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉన్నట్టు సమాచారం.

అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు ఒక్క రోజు సెలవు ప్రకటించారు.ఆ సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దట్టంగా వ్యాపించిన పొగవల్ల 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. తక్కువ లోడ్‌ కరెంటును తీసుకుని ఎక్కువ కరెంటు వినియోగించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.