ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నా ఆస్తి ఇచ్చేస్తా: మంచు విష్ణు ఓపెన్ చాలెంజ్

07:59 - March 24, 2019

*రాజకీయ చర్చల్లోకి శ్రీవిదానికేతన్ వివాదం 

*టీడీపీ కౌంటర్ కి మంచు విష్ణు ఓపెన్ చాలెంజ్ 

*ఒక్కరూపాయి ఎక్కువ అడిగినట్టు రుజువు చేస్తే ఆస్తి మీకే ఇచ్చేస్తా 

ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, ఎన్నో విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని ఆరోపిస్తూనటుడూ, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడూ మోహన్ బాబు కొన్నిరోజులుగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనలకూ, వ్యాఖ్యలకూ టీడీపీ కూడా గట్టిగానే సమాధానం చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ని రంగంలోకి దించింది.

    ఆయన ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. మోహన్ బాబు బయట మాత్రం తన కాలేజీలో విద్యార్థులకు ఫ్రీగా చదివిస్తున్నానని, 25 శాతం మంది విద్యార్థులకు తానే ఫీజులు కడుతున్నానని చెబుతారని. అలాంటప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అడగడం ఎందుకని, ఆయనకున్న నాలుగు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆయన ఫీజురీయింబర్స్‌మెంట్‌ వసూలు చేస్తారని ఆరోపించారు. మరి ఆయన ఉచితంగా ఎవరిని చదివిస్తున్నారని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చలకు సిద్ధమనీ చెప్పాటంతో దానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


అయితే మోహన్ బాబు తన విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలపై ఆయన కుమారుడు మంచు విష్ణు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విద్యార్థులకు  ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. ప్రభుత్వం నుంచి మేము లేఖలో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా. నా ఆస్తులన్నీ అమ్మేసీ మీ పార్టీ కు ఇస్తానని మంచు విష్ణు టీడీపీ నేతలకు ఓపెన్ చాలెంజ్ చేశాడు.  మానాన్న గారు 25శాతం పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నారని..అది మీ డబ్బులతో కాదని .. నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతోనే ఇవన్నీ నడిపిస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. 

టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మోహన్ బాబు గళమెత్తండం.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో మొదట మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం మొత్తం టీడీపీ వ్యాఖ్యలను ఖండిస్తోంది. మనోజ్ ఏకంగా బకాయిలకు సంబంధించిన డాక్యుమెంట్లను ట్విట్టర్లో పోస్టు చేసి టీడీపీకి సవాల్ విసిరారు. ఇప్పుడీ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. విష్ణు చేసిన చాలెంజ్ కి గనక సరైన సమాధానం చెప్పలేకపోతే టీడీపీ ఇరుకున పడ్డట్టే.