మహానాయకుడుపై...నాదెండ్ల ఫైర్‌

13:42 - February 24, 2019

బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఎన్టీఆర్-మహానాయకుడు’. ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్టుగా  ఎన్టీఆర్-మహానాయకుడు లో విలన్ గా చంద్రబాబును కాకుండా ఒకప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావును చూపించారు. తాజాగా తనను విలన్ గా చూపించడంపై నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. ఎన్టీఆర్ వారసులు తీసిన ఈ సినిమా విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించడానికి ఏముంటుందని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విలన్ చంద్రబాబు నాయుడే అని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడే తన వద్దకు ఒకప్పుడు వచ్చాడని నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. సినిమాలతో నిజాలను మార్చలేరని.. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులేనని.. ఎన్టీఆర్ ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనని నాదెండ్ల సంచలన కామెంట్స్ చేశారు.  ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాక.. ఆయన చుట్టూ చేరారు అని.. ఎన్టీఆర్ కు ఆయన వారసులే తీవ్రంగా ఇబ్బంది పెట్టారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఆయన తన తిండి అవసరాల కోసం కొంత సొమ్ముపెట్టుకుంటే.. దానిపై కూడా కోర్టుకు వెళ్లి.. ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి హింసించారని వారసులపై నాదెండ్ల నిప్పులు చెరిగారు.  తనను విలన్ గా చూపించడంపై నోటీసులు పంపించినట్టు నాదెండ్ల తెలిపారు. అధికారంలో ఉండడంతో వారిని ఎవరూ ఏం చేయడం లేదని.. కానీ ప్రతిఫలం అనుభవిస్తారని నాదెండ్ల హెచ్చరించారు.