మధులిక పరిస్తితి మరింత విషమం: పట్టుబడ్డ భరత్

18:07 - February 6, 2019

ప్రశాంతంగా ఉందనుకుంటున్న నగరం మరోసారి ఉలిక్కి పడింది. ప్రేమోన్మాది అనే మాట కన్నా "పరువు హత్యల" వార్తలే ఎక్కువ అవుతున్నాయి. ఇక మీదట కులం అనే విషసర్పం తప్ప ప్రేమోన్మాది అనె మాట తగ్గినట్టే అనుకుంటున్న సమయంలో మరో ధారుణం జరిగింది ఇంటర్ చదువుతున్న మధులిక అనే అమ్మాయిపై ఓ భరత్ అనే యువకుడు దాడికి తెగబడ్డాడు. కొబ్బరికాయలు నరికే కత్తితో అమ్మాయిపై దాడి చేశాడు. కొంతకాలంగా భరత్ ప్రేమ పేరుతో అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం మధులిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మలక్‌పేటలో యశోద ఆస్పత్రికి తరలించారు. మధులిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. 

 భరత్ చేసిన దాడిలో మొత్తం 15 చోట్ల బాలిక శరీరం పై గాయాలయ్యాయని, చికిత్సకు శరీరం సహకరించటంలేదని డాక్టర్లు చెపుతున్నారు. వెంటిలేషన్ పై ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని,  72 గంటలు గడిస్తే కానీ పరిస్ధితి ఏమీ చెప్పలేమని మలక్ పేట యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. 

ఈస్ట్ జోన్  డిప్యూటీ కమీషనర్  ఆధ్వర్యంలో, 4 టీమ్ ల ద్వారా గాలింపు జరిపి  కాచిగూడ ప్రాంతంలోని ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై దాడి చేసిన తర్వాత  నిందితుడు కాచిగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించటం గమనించారు, భరత్ సంచరించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా భరత్ కదలికలు కనిపెట్టిన పోలీసులు  ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను అదుపులోకి తీసుకున్నారు.  మధులిక పై దాడి చేసేందుకు ఉపయోనగించిన కొబ్బరి బొండాల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.భరత్ సెల్ పోను ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం మధులికను వెంటిలేటర్‌పై ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు. తల, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె శరీరంలో 14 నుంచి 15 చోట్ల కత్తి గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయలేదు. ఎడమ చేతి వేలు తెగిపోయింది. న్యూరో, ఆర్థో, జనరల్, ప్లాస్టిక్ సర్జన్ల వైద్యుల బృందం యువతిని పర్యవేక్షిస్తోంది అని డాక్టర్లు తెలిపారు.