' మా ' ఎన్నికల వార్‌లో నలుగురు బిగ్‌ షాట్స్‌...

13:30 - March 4, 2019

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో షాడో గేమ్ రన్ అవుతోందా? ఈసారి ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత తీవ్రమైన పోటీ నెలకొనబోతోందా? అంటే అవుననే చెబుతున్నారు.   మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో ఆరు రోజులే సమయం ఉంది. ఆ క్రమంలోనే ఎవరికి వారు కత్తులు నూరుతున్నారు.  ఆసక్తికరంగా ఈ వార్ లో ఓ నలుగురు బిగ్ షాట్స్ తెర వెనక ఉండి కథ నడిపించడంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నలుగురు? అంటే.... మెగాస్టార్ చిరంజీవి.. మాజీ `మా` అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్.. సూపర్ స్టార్ మహేష్... వేరొక మాజీ అధ్యక్షుడు మురళి మోహన్.  ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నరేష్ ..  శివాజీ రాజాకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వార్ షురూ అయ్యింది. అయితే శివాజీరాజాకు మెగాస్టార్ తరపున అండాదండా ఉన్నాయి. తెరవెనక కథ నడిపించే షాడోగా మెగాస్టార్ పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ శివాజీ రాజా గెలుపునకు బాటలు వేసింది చిరంజీవినే. వాస్తవానికి `మా` ఎన్నికలు ఏకగ్రీవం కావాల్సి ఉంది. శివాజీ రాజాకే ఈసారి కూడా ఛాన్స్ ఇవ్వాల్సిందిగా.. పోటీకి దిగొద్దని నరేష్ ని చిరు కోరినా అందుకు అతడు అంగీకరించలేదట. ఆ క్రమంలోనే జీవిత రాజశేఖర్ బృందాన్ని బరిలో దించి నరేష్ సరికొత్త వార్ కి తెర తీశారు. అధ్యక్ష పదవి రేసులోకి వస్తూ మెగాస్టార్ వ్యతిరేకుల్ని నరేష్ కావాలనే తెరపైకి తెచ్చారన్న చర్చ సాగుతోంది. కాగా... మాజీ అధ్యక్షులు మురళిమోహన్ రాజేంద్ర ప్రసాద్ కచ్ఛితంగా శివాజీ రాజాకు వ్యతిరేకంగానే ఉంటారన్న చర్చా మరోవైపు సాగుతోంది. అంటే నరేష్ కి ఆ ఇద్దరూ సపోర్ట్ గా నిలిచే ఛాన్సుందన్న ముచ్చట సాగుతోంది. అయితే నరేష్ టీమ్ గెలుపు వెనక నిలిచే బిగ్ షాడో ఎవరు? అంటే సూపర్ స్టార్ మహేష్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. అయితే మహేష్ కి ఇలాంటి వ్యవహారాలు అంటే అస్సలు గిట్టదు. తనకు ఉన్న షెడ్యూల్స్ కూడా అందుకు సహకరించవు. అయితే అన్న నరేష్ కోసం కేవలం ఓటు వేసేందుకు మాత్రం ఆ రోజు వస్తాడట. ఇక నరేష్ కి ఓటేయాల్సిందిగా తోటి ఆర్టిస్టులకు మహేష్ సిఫారసు చేస్తారా.. లేదా? అన్నది అప్రస్తుతం. ఏదిఏమైనా...మెజారిటీ పార్ట్ పెద్ద ఆర్టిస్టుంతా శివాజీ రాజా వైపే మొగ్గు చూపడం అన్నది అతడికి ప్రధాన బలం కానుందట. అంటే...మార్చి 10న జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అన్నది వేచి చూడాల్సిందే.