లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?...

12:45 - February 9, 2019

తెలంగాణలో గత కొంతకాలం నుండి ఎన్నికల హడావిడి వస్తుందీ...పోతుందీ. అసెంబ్లీ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు...ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలకు అయ్యే ఖర్చు విషియానికి వస్తే... తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు రూ.350 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఈ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల ఖర్చుకు వేలాది కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అవుతున్నట్లే.  ఎన్నికల నిర్వహణకు జరిగే అధికారిక వ్యయం ఇంత భారీగా ఉంటే.. ఇక ఎన్నికల బరిలో దిగిన నేతలు పెట్టే ఖర్చు లెక్కలు వేస్తే.. అది కూడా భారీగానే ఉంటుందని చెప్పాలి. అయితే...ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు మొత్తం ప్రజలు కట్టిన పన్ను మొత్తమే. ఎన్నికలన్న వెంటనే అందరిలోనూ అదోలాంటి జోష్ వస్తుందే తప్పించి.. ఇంత భారీ ఖర్చు ఉంటుందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరని చెప్పక తప్పదు.