ఎన్టీఆర్‌ లక్కీ నెంబర్‌తో...లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ముహూర్తం

15:33 - March 11, 2019

 సెన్సార్ కు ఎప్పుడు వెళ్ళేది తప్ప లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో అంతా ఓపెన్ అయిపోయింది. 22న విడుదలను మరోసారి ఖాయం చేస్తూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. అయితే దీనికో విచిత్రమైన లాజిక్ పెట్టాడు.  ఏప్రిల్ 11 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే వేడి రాజుకుంది. నెల రోజులు చాలా తక్కువ టైం కాబట్టి కిందా మీద పడుతున్నారు. ఈ పాయింట్ నే పట్టుకున్నాడు వర్మ. విడుదలవుతున్న తేదీ 22 ప్లస్ ఎన్నికలు జరిగే తేదీ 11 ప్లస్ ఫస్ట్ డే మొదటి ఆట ప్రదర్శించే టైం 12 మొత్తం కలిపి 9 వస్తుందని చెబుతున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే 9 ఎన్టీఆర్ లక్కీ నెంబర్ అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే తొమ్మిది ఎలా వస్తుందంటే...2+2+1+1+1+2 కూడితే తొమ్మిది వస్తుంది కదా. ఈ రకంగా వర్మ ముహూర్తంని కూడా వాడేసుకున్నాడు.  ఇప్పటి నుంచి చూసుకుంటే విడుదలకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఉదయం 12కి ఫస్ట్ షో అన్నాడు కాబట్టి సంప్రదాయం ప్రకారం 8.45కు వేసే ఆట లేనట్టేగా. ముందు రోజు ప్రీమియర్ షో వేసే ఆలోచన కూడా వర్మకు ఉన్నట్టు లేదు. తన నిర్మాణంలో వచ్చిన గత చిత్రం భైరవ గీతకు వేశాడు కానీ ఆఫీసర్ తరహాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలంటె రిలీజ్ రోజు 12 దాకా వెయిట్ చేయాల్సిందే.