ట్రైలర్‌లోనే వర్మ అంతా చూపించాడుగా...!

14:27 - February 14, 2019

'లక్ష్మీస్ ఎన్టీఆర్'.   రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకూ ఎన్నో సెన్సేషనల్ సినిమాలు డైరెక్ట్ చేశాడు కానీ ఇది సెన్సేషనల్ సినిమాల లిస్టులో నెంబర్ వన్.  కారణాలు అందరికీ తెలిసినవే.  ఏవి నిజాలు.. ఏవి అబద్ధాలు అనేవి ఎవరికీ అర్థం కానంతగా ఎన్టీఆర్ జీవితంలోని చివరి దశ గురించి ప్రచారం జరిగింది. ఇక ట్రైలర్ విషయయానికి వస్తే "నమ్మితేనే కదా ద్రోహం చేసేది- అడవి రాముడు సినిమాలో ఒక డైలాగ్" అంటూ ఒక స్లైడ్..   "1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయినా తరువాత రోజులవి" అనే మరో స్లైడ్ తో మొదలుపెట్టారు. మొదటి షాట్ లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ కు దూరంగా వెళ్ళడాన్ని సింబాలిక్ గా చూపించాడు. ఎన్టీఆర్ ఒక్కరే హాలు మధ్యలో అలా నిలబడి ఉంటారు. ఆయన అలా ఒంటరి అయిన సమయంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ.  ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాసేందుకు ఆమె ఎన్టీఆర్ వద్దకు వస్తారు.  ఇక అయన ఒక్కరే ఉండడం..లక్ష్మీ పార్వతి బయోగ్రఫీ రాస్తుండంతో అయన ఇంట్లోనే ఉంటుంది.  దీంతో గుసగుసలు మొదలవుతాయి. తరువాత షార్ట్‌లో  "ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి. మా జీవిత చరిత్ర రాస్తుంది" అంటూ ఆవిడను పార్టీ నాయకులకు పరిచయం చేస్తారు ఎన్టీఆర్. అక్కడ చంద్రబాబు కూడా ఉంటారు. నెక్స్ట్ షాట్ లోనే "టీడీపీ లో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ".. "పార్టీలో ఆడపెత్తనం" అని తాటికాయంత అక్షరాలతో ఈనాడు మెయిన్ పేజ్ లో ఆర్టికల్స్.  ముందు షాట్ కు ఈ షాట్ కు లింక్ సూపర్ గా కుదిరింది కదా? దీనికి స్పందించిన ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్ లో ఈ విమర్శలకు.. గుసగుసలకు సమాధానం ఇస్తారు. "శారీరక సుఖం కోసమో. ఇంకేదో వ్యక్తిగత ప్రోద్బలం కోసమో.. కాదు" అన్నట్టుగా విస్పష్టంగా ప్రకటన చేస్తారు. ఈ ప్రకటన తరువాత బాబు...ఎన్టీఆర్‌ కుటుంబంలో ఒక బాంబు పేలుస్తాడు. నెక్స్ట్ బాబుగారి వాయిస్ లో "దానిగ్గాని కొడుకు పుట్టారంటే మీ ఫ్యామిలీ ఫినిష్" అని ఎన్టీఆర్ ఫ్యామిలీని 'అప్రమత్తం' చేసి సున్నితంగా హెచ్చరిస్తారు.  దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చంద్రబాబు కు మద్దతుగా నిలవడంతో "మీరు నా పిల్లలై ఉండి కూడా వాడితో చేరారా.. సిగ్గు లేకుండా.. ఛీ?" అంటూ తన పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు ఎన్టీఆర్. ఇంకో సీన్ లో బహిరంగ సభలో లక్ష్మీ పార్వతిని తన అర్థాంగి గా చేసుకుంటారు ఎన్టీఆర్.   దీంతో వైస్ రాయ్ ఎపిసోడ్ కు బీజం పడుతుంది.  వైస్ రాయ్ ముందు ఎన్టీఆర్ నిరసన.. వ్యతిరేక వర్గం వారు  ఎన్టీఆర్ పై చెప్పులు వేయడం అంతా ఉంది.   ఆ తర్వాతఫైనల్ షాట్..  "నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు వాడిని నమ్మడం" అంటూ కన్నీటితో.. క్రోధం తో అంటారు. అందరూ అనుకున్నట్టే వర్మ అంతా చూపించాడు.   దాదాపు ఈ ట్రైలర్ లోనే స్టొరీ అంతా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ అంటే పక్కాగా ట్రైలర్. ఏం దాచలేదు వర్మ.. ఇది సంచలనం సృష్టించడం ఖాయమే అంటున్నారు కొందరు సినీప్రముఖులు.