పిల్లలకోసం ఓ నాన్న చేసిన అద్బుతం :వ్యర్థాలతో "మినీ ఆటో"

22:28 - February 6, 2019

పిల్లలు బొమ్మల కోసం ఏడిస్తే ఏ తండ్రైనా ఏం చేస్తాడు? షాపుకి వెళ్ళి ఒక బొమ్మ కొనిస్తాడు. అలాగే తనపిల్లలకూ తానూ ఎవరో తయారు చేసిన బొమ్మ కొని ఇచ్చేస్తే ఏముందీ అనుకున్నాడేమో గానీ తనకు ఉన్న పరిఙ్ఞానాన్ని పిల్లల కోసం ఉపయోగించి ఏకంగా ఒక మినీయేచర్ ఆటోరిక్షా తయారు చేసి ఇచ్చాడు కేరళాలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ పురుషోత్తమన్. 

 మినీయేచర్ అంటే అచ్చంగా ఉండే మోడల్ లాగా మాత్రం కాదు ఈ ఆటో రిక్షా నిజంగానే రోడ్డు మీద పరుగులు తీస్తుంది. అయితే పిల్లల కోసం తయారు చేసిన ఈ మినీ ఆటో ఇప్పుడు అతన్ని ఇంటర్నెట్ లో స్టార్ ని చేసేసింది. నిజానికి అరుణ్ పెద్ద ఇంజనీర్ కాదు ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 


   అయితే ఇలా వ్యర్థాలతో వాహనాలు చేయటం అతనికి కొత్తేమీ కాదు డూ-ఇట్-యువర్‌సెల్ఫ్ చానెల్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ పనికి రాని వ్యర్థాలతో రకరకాల ఉపయోగకరమైన వస్తువులని తయారు చేయటంపై ఆసక్తి ఉన్నవాళ్ళంతా ఉంటారన్న మాట. నిజమైన ఆటోకి ఏమాత్రం తగ్గని విధంగా తయారు చేయబడ్డ ఈ ఆటో బాడీ మొత్తం డిష్ టీవీలకు ఉపయోగించే గొడుగులతోనే తయారు చేసాడు. చెక్కలతోనే చక్రాలు తయారు చేశాడు. ఇలా ఏడు నెలల్లో 15 వేల రూపాయల ఖర్చుతో ఈ ఆటోని రెడీ చేసి పిల్లలకి ఇచ్చాడు.  

అరుణ్ తండ్రి ఒక వడ్రంగి, అరుణ్ కోసం ఓ సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకుని, వాటి చక్రాలను చెక్కలతో తయారు చేసి అందంగా మార్చేశాడట.అదే స్పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చెక్కతో చిన్న చిన్న బొమ్మలు, వాహనాలు తయారు చేయడం మొదలుపెట్టాడట అరుణ్.  ఈ మినీయేచర్  వాహనాలన్నీ సాధారణ వాహనాల తరహాలో బ్యాటరీ సాయంతో నడుస్తాయి.  

"టాయ్ కార్ల ధర వేలాది రూపాయలు ఉంటున్న నేపథ్యంలో నేనే స్వయంగా కారును తయారు చేయాలని నిర్ణయించాను. జవహార్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో నర్శింగ్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు. నా కొడుకు మాదవ్ కోసం శూవ్ తయారు చేశాను.  ఆ తర్వాత నా కూతురు కేశినిక్రిష్ణ కోసం త్రీవీలర్ బైక్ కూడా తయారు చేశా" అని తెలిపాడు. 1990లో విడుదలైన మలయాళం చిత్రం ‘అయే ఆటో’ సినిమా స్ఫూర్తితో ఆటో ఈపుడు మీరు చూస్తున్న ఆటో  తయారీ మొదలుపెట్టాడు. ఆ సినిమాలో హీరో ఆటోను ‘సుందరి’ అనిపిలుస్తాడు. అందుకే అరుణ్ కూడా తన మినీ ఆటోకు ‘సుందరి’ అని పేరు పెట్టాడు.