మాటల్లో ధనిక రాష్ట్రం...చేతల్లో అప్పుల కోసం పరుగులు

12:03 - January 10, 2019

ఒకప్పుడు మీరు అప్పు అడగటమే గొప్పగా ఫీలై.. అడిగినంతనే ఇంటికి తెచ్చి ఇచ్చే పరిస్థితి పోయి.. వారింటి చుట్టూ  తిరిగే పరిస్థితికి చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితి ఇంచుమించు అదే రీతిలో ఉందని చెప్పాలి.  ధనిక రాష్ట్రంగా ఉన్న పేరు తర్వాత.. ఇప్పుడు రూ.500 కోట్ల అప్పు కోసం ఢిల్లీకి ఫైళ్లు పట్టుకొని బ్యాచుల వారీగా వెళ్లాల్సి వస్తోంది. ఆ అదేంటీ రూ.500కోట్లు ఏమైనా చిన్న విషియమా..దాని కోసమని  ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదా? అని ప్రశ్నించొచ్చు. ఇక్కడ మర్చిపోకూడని పాయింట్ ఏమంటే.. రూ.500 కోట్ల అప్పు మనం అడగటం లేదు.. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. దాదాపు లక్షన్నర కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం రూ.500 కోట్ల అప్పు కోసం.. అందునా ఈ ఏడాది రెండో విడత చెల్లించాల్సిన రైతుబంధు పథకం అమలు కోసం కావటం మర్చిపోకూడదు. ఎన్నికల వేళలో చాలామంది బ్యాంకు అకౌంట్లలో రైతుబంధు మొత్తాల్ని పడ్డాయి. కానీ.. కొందరికి మాత్రం చేరలేదు. దీనికి కారణం.. పథకం అమలుకు అవసరమైన నిధులు చేతిలో లేకపోవటమే. తాజాగా ఈ పథకంలో పెండింగ్ ఉన్న రూ.500 కోట్ల కోసం ఒక సంస్థ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇందు కోసం రాష్ట్రం గురించి గొప్పలు చెప్పి.. అప్పుకు తాము ఎంత అర్హులమన్న విషయాన్ని చెప్పి.. అప్పు తెచ్చుకోవటానికి తెలంగాణ అధికారుల బృందం ఒకటి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగాఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరంటారు కేసీఆర్?