సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: అక్బరుద్దీన్ సహా హాజరు కాని ఆ నలుగురు, స్పీకర్ ఆయనే

14:13 - January 17, 2019

ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ముందుగా.. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఇవాళ 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరు కాలేదు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 

తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మహిళా సభ్యుల్లో రేఖా నాయక్. బానోతు హరిప్రియ నాయక్ లు ఇంగ్లిషులో ప్రమాణం చేయగా.. మిగిలిన వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు. 

 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  ఎవరన్న దానిపై గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న సస్పెన్స్ తొలగిపోయింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. స్పీకర్ ఎన్నికకు మిగిలిన పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలపటంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన పోచారం. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నేతగా ఉన్న పోచారం.. పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న ఆయనకు తొలి అసెంబ్లీలో మంత్రి పదవి దక్కింది. తాజాగా.. స్పీకర్ గా ఆయన్ను కేసీఆర్ ఎంపిక చేశారు. తనకు అత్యంత దగ్గరైన పోచారం.. టీడీపీ నాటి నుంచి ఉన్న సన్నిహితంతోనే ఆయన్ను స్పీకర్ గా  సెలెక్ట్ చేశారన్న మాట వినిపిస్తోంది.