అంచనాలు అందుకున్న కథానాయకుడు:( రివ్యూ)  

13:04 - January 9, 2019

 

పంచ్ లైన్ : బయోపిక్ మాత్రమే ఎపిక్  కాదు  

మనకి బయో పిక్ అనేది ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. మణిరత్నం "ఇద్దరు" టైం నుంచీ ఇది సక్సెస్ ఫార్ములా అనే చెప్పుకొవచ్చు. అయితే గత అయిదేళ్ళలో ఈ తరహా సినిమాలవల్ల మిగతా "లాభాలు ఉన్నాయి" అని ఎప్పుడైతే అర్థమయ్యిందో. అప్పటినుంచే ఇదొక ట్రెండ్ గా తయారయ్యింది. క్రీడాకారుల జీవితాలతో బాలీవుడ్ వరుస సినిమాలు తెచ్చి దీనిలో కాసుల వాన కురిపించొచ్చు అని ఎప్పుడైతే నిరూపించిందో అప్పుడే డర్టీ పిక్చర్ లాంటి సినిమా దీన్ని నటులకూ విస్తరించింది. అదే తరహాలో ఇప్పుడు టాలీవుడ్ లోనే ఈ తరహా బయోపిక్ ల హవా మొదలయ్యింది. గత ఏడాది "మహానటి" గా ఒకనాటి టాప్ హీరోయిన్ సావిత్రి గారి సినిమా వచ్చి మరోసారి ఈ విషయాన్ని దృవీకరించింది. అదే బాటలో ఇప్పుడు వచ్చిన సినిమా "కథా నాయకుడు". ఒకనాటి సూపర్ హీరో, నటుడూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రీ అయిన నందమూరి తారకరామారావు లైఫ్ స్టోరీనే సినిమా స్టోరీగా చేయటం, అందులోనూ స్వయంగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో కనిపించటం. ఈ సినిమా మీద అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇవాలే రిలీజ్ అయ్యింది. మరి మిగతా బయో పిక్ లకీ ఈ సినిమాకూ ఉన్న తేడా ఏమిటీ? ఎంటీఆర్ జీవితాన్ని అనుకున్నట్టుగా తెరెకెక్కించారా? ఈ సీజన్లో ఈ సినిమా ప్రయత్నం ఏమైనా రాజకీయ ప్రయోజనాలను తెస్తుందా అన్న విషయాలు రివ్యూలో.... 

కథ
ఒక సాధారణ రైతుబిడ్ద జనం మెచ్చిన నటుడుగా, ఇండస్ట్రీ టాప్ హీరోగా అక్కన్నుంచీ మహా నాయకుడుగా ఎలా ఎదిగాడు అన్న పాయింట్ నే, దాదాపుగా సినిమా మొత్తం జనానికి సీన్ టూ సీన్ తెలిసిందే అయినా వాటిని ఇంట్రస్టింగ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు. దాదాపుగా ఆ ప్రయత్నం లో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. 
సినిమా ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం తో మొదలు పెట్టటమే క్రిష్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంత పక్కాగా రాయబడిందో చెప్పేస్తుంది. బసవతారకం (విధ్యాబాలన్) క్యాన్సర్ తో బాదపడుతుంటే తల్లి ఆరోగ్యం గురించి పెద్దకొడుకు హరికృష్న (కళ్యాణ్ రామ్) ఆందోళన పడుతూ ఉంటాడు. ఆ  చికిత్స తీసుకుంటున్న సమయంలో  బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ పాత ఫొటోలని చూస్తూ ఉండగా సినిమా మొత్తం ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఇంతకంటే కథ చెప్పటానికి ఏమీలేదు ఎందుకంటే కథమొత్తం మనకు తెలిసిందే అయితే సినిమా వెర్షన్ లో మళ్ళీ ఎంటీఆర్ ని చూడటం వేరు కదా. రైతుబిడ్డగా జన్మించి , కళామ్మతల్లి ముద్దుబిడ్డగా పెరిగి, తెలుగు చలనచిత్ర రంగానికి రారాజుగా ఎదిగి  అసలు ఎక్కడో విజయవాడలో సబ్ రిజస్టార్ జాబ్ లో ఉన్న నందమూరి రామారావు.(బాల‌కృష్ణ‌) కు సినిమాల్లోకి ఎందుకు వెళ్లాలనిపించింది? సినిమాల్లో రాణించటానికి ఏ అడ్డంకులు ఎదుర్కొన్నారు? ఒక సాధార‌ణ నటుడుగా ..  గొప్ప స్టార్‌గా  ఎలా ఎదిగారు.పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది. అలాగే తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా కనిపించారు..ఒప్పించ గలిగారా.. వంటి విషాయుల తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 
సినిమా వ్యాఖ్య:

స్క్రీన్ ప్లే ఎంత బలంగా రాసే ప్రయత్నం చేసినా మొత్తంగా కథ చూపాలి అంటే ఈ కొద్దిపటి సమయమూ సరిపోదు. దానికి తోడు ఎక్కువ గెటప్ లు చూపించాలన్న తాపత్రయంలో ఎక్కువ సీన్లు రాసుకోవటంతో వెంటవెంటనే వచ్చి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సినిమా కూడా మరీ పరుగుతీస్తున్నట్టు సినిమా అంతా పైపైన చూపాడన్న ఫీల్ వచ్చింది. ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగులు కూడా మరీ సినిమాటిక్ గా అనిపించాయి. కొన్ని డైలాహులు కల్పిత పాత్రలకు మాత్రమే బావుంటాయి. ఇక మనం చూసిన ఎన్టీఆర్ నే అలాగే చూపించినట్టు అనిపించారు తప్ప ఆయన కోణంలో ఆయన లోలోపలి ఎమోషన్ ని చూపలేదు.  దాంతో ఎవరో చెప్తున్నప్పుడు వింటున్నట్టుగా ఉంది తప్ప ఆయన పాత్రతో ఉండాల్సిన ఏమొషనల్ ఫీల్ ప్రేక్షకుడిలో రాలేదు. ఒక కుటుంబ యజమానిగా, మనుషులతో అద్బుతమైన ప్రేమ కలిగిఉన్నవడిగా చూపటం, భార్య తో ఆయనకున్న అనుబంధం..కుటుంబ బంధాలు అనే కొత్త కోణం ఆయన అభిమానులకు పరిచయం చేసినట్లు అయ్యింది. నిజానికి బయోపిక్ అంటేనే ఒక డాక్యుమెంటేషన్ అనుకోవాలి. అయితే దీన్ని తీసిన తీరు మాత్రం ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ అభిమానులకు అద్బుతమైన బహుమతి అనే అనుకోవాలి. 

ఇక (ఎక్కడా అన్నది చెప్పకూడదు గానీ) మరీ అంత హైప్ చూపించాల్సిన అవసరం లేదేమో. నిజానికి అదే కీలకమైన సన్నివేశం దాన్ని పూర్తి కల్పిత ఏపిసోడ్ అన్నంత హైప్ చేయటం సూటవ్వలేదు. అక్కడ నుంచి రాజకీయంగా సినిమా కలర్ ని మార్చుకుంటూ వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రకటించటం అనే ఎపిసోడ్ వరకూ చాలా జాగ్రత్తగా, ఆకట్టుకునేలా డిజైన్ చేసారు . సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడు స్క్రీన్ వంక చూస్తూ ఉండిపోతాడు. వరుసగా వచ్చే సన్నివేశాలని ప్రజెంట్ చేసిన తీరూ, ఎన్టీఆర్ గెటప్లో కనిపిస్తున్న బాలయ్యా ఇక్కడ సినిమాని మరో మెట్టు ఎక్కించారని చెప్పుకోవాలి. 

నటీనటులు
నిజానికి సినిమా మొత్తం బాలయ్య వన్మాన్ షో అనే చెప్పుకోవచ్చు. వరుస గెటప్పులు అవీ ఎన్టీఆర్ చేసిన పాత్రలుగా వెయ్యాల్సినవి అంటే ఒక్క సీన్లో రెండుసార్లు నటించాలి. ఈ విషయంలో బాలయ్య బాగానె వర్కౌట్ చేసారు. ఆయన డెడికేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఫస్టాఫ్ లో యంగ్ ఎన్టీఆర్ గా కనిపించాల్సివచ్చినప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాస్త ఎమోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ అయ్యిందేమో అనికూడా. అయితే సెకండాఫ్ లో ఉండే గెటప్ లు అన్నీ బాలయ్యకు బాగా సూటయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ ఎన్టీఆర్ మిడిలేజ్, ఆ తర్వాతా వేసినవి. కాబట్టి బాలయ్య చక్కగా అమరిపోయారు. ఇక విధ్యా బాలన్ సరైన పాత్రకి సరిగ్గా చేసినట్టు చేసింది. అమెనే ఈ పాత్రకి ఖచ్చితమైన ఆప్షన్ అనిపిస్తుంది. ఇక అక్కినేని లా కనిపించిన సుమంత్ ని చూస్తే మాత్రం "సావిత్రి" బయో పిక్ లో కూడా ఇతన్నే తీసుకుని ఉండాల్సింది అనిపించేలా ఉన్నాడు. మిగతా పాత్రలన్నీ మనకు ఎక్కువగా బయటప్రపంచంలో తెలియనివే కనుక, వాళ్ళెలా ఉండేవాళ్ళో పక్కాగా తెలియదు కనుక ఓకే అనుకోవచ్చు. అయితే "నందమూరి హరికృష్నగా చేసిన కళ్యాణ్ రామ్ ఇంకాస్త శ్రద్ద పెడితే బావుండేది. 
 
టెక్నికల్ గా

బయోపిక్ అనగానే కథ రాసుకోవటానికి ఇబ్బంది ఉండదు చాలా ఈజీ అనుకుంటాం గానీ. మామూలు కల్పిత కథ కంటే దీనికే ఎక్కువ కష్టపడాలి. ఏమాత్రం హైప్ చేసినా, తీసుకున్న నటులు పాత్రలో లీనం కాకపోయినా, అంతెందుకు మేకప్ లో చిన్నపటి తేడావచ్చినా కష్తమే. సినిమా పోవటమే కాదు విమర్శలుకూడా మూటగట్టుకోవాల్సివస్తుంది. అయితే ఇక్కడ క్రిష్ ఆ తప్ప్పు చేయలేదు. అంతే కాదు సినిమాని ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఫ్లాష్ బ్యాకి వెళ్లటం అనే పాయింట్ ని కూడా "మహానటి" సినిమా లాగానే చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. 
ఇక నిర్మణ విలువల్లో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి వర్క్ రాబట్టుకోవటం క్రిష్ కి బాగా తెలిసిన విధ్య. ఆ కష్టం ఆర్ట్ వర్క్ లో, నటుల మేకోవర్ లో, సినిమాటో గ్రఫీలో కనిపించింది. కెమెరా వర్క్ ఈ సినిమాకి ఒకరకంగా అదనపు ప్రాణం అయ్యింది. కీరవాణిగారు సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు ఎంత బాగున్నాయో. బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ అంతకన్నా బాగుంది. అయితే ఈ రెండింటికన్నా మధ్య మధ్యలో వచ్చే ఎన్టీఆర్ పాత పాటల రీమిక్స్ మరింత బాగుంది. 


ఓవరాల్ గా చూస్తే ఈ సీజన్ ని ఎన్టీఆర్ బయోపిక్ "కథానాయకుడు" గ్రాబ్ చేసిందనే చెప్పుకోవాలి. తెలిసిన కథనే క్రిష్ చెప్పిన తీరు కోసం మళ్ళీ చూడటం లో ఉన్న అనుభూతిని మాత్రం అందుకోగలం. ఇంతకన్నా ఇంకేం లేదని చెప్పుకోవచ్చేమో గానీ నేను చెప్పకూడదు. పైరసీ లో కాకుండా థియేటర్లోనే చూదంది 

ప్లస్ పాయింట్స్: ఎన్టీఆర్ స్టామినా,బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, సంగీతం
మైనస్ పాయింట్స్: వరుస గెటప్ లతో నింపేయటం, గొప్పగా ఉండాలకొని చప్పగా తీసిన సీన్లు 

రేటింగ్: 3.5 

మరిన్ని: 


దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌

ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ

సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

విడుదల తేదీ: 09-01-2019