ఉత్తమ ప్రజాకీయ పార్టీ: 14 మంది అభ్యర్థులతో ఉపేంద్ర తొలి జాబితా

15:19 - April 1, 2019

 *"ఉత్తమ ప్రజాకీయ పార్టీ "అభ్యర్థుల తొలి జాబితా

*జాబితాను ప్రకటించిన  పార్టీ అధినేత, నటుడు ఉపేంద్ర

*ఎన్నికల ఖర్చు అభ్యర్థులదే, పార్టీ కరపత్రాలు మాత్రమే  ఇస్తుంది  

 

 

ప్రముఖ కన్నడ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత ఉపేంద్ర లోక్‌ సభకు పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తొలివిడతలో నామినేషన్‌ దాఖలు చేసిన 14 మంది అభ్యర్థులను ఉపేంద్ర ప్రజలకు పరిచయం చేశారు. కర్ణాటకలోని 28 లోక్‌ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తమ గుర్తు ఆటో అని.. అందుకే  ప్రతి అభ్యర్థి సామాన్యుడిలా ఖాకీ చొక్కా ధరించి ప్రచారం చేస్తారని ఉపేంద్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

                                                                               

ఎన్నికల ప్రచార ఖర్చును అభ్యర్థులే పెట్టాలని, కరపత్రాలను మాత్రమే పార్టీ సమకూరుస్తుందని ఉపేంద్ర తెలిపారు.మొత్తం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు పార్టీ తరపున ఆరేడు లక్షలు ఖర్చు చేయదలిచానన్నారు  ఇదే సందర్భంగా తొలివిడత 14మంది అభ్యర్థులను పరిచయం చేశారు.
 ఉడిపి -చిక్కమగళూరు - సురేశ్‌ కుందర్‌, హాసన్‌ - చంద్రేగౌడ హెచ్‌.ఎం, దక్షిణకన్నడ - విజయ్‌ శ్రీనివాస్‌, చిత్రదుర్గ - దేవేంద్రప్ప, తుమకూరు - ఛాయా రాజశంకర్‌, మండ్య - దివాకర్‌ సి.పి.గౌడ, మైసూరు - ఆశారాణి, చామరాజనగర్‌ - నాగరాజ్‌.ఎం, బెంగళూరు గ్రామీణ - మంజునాథ్‌.ఎం., బెంగళూరు ఉత్తర - సంతోష్‌.ఎం, బెంగళూరు సెంట్రల్‌ - శ్రీదేవి మల్లేగట్టి, బెంగళూరు దక్షిణ - అహోరాత్రా, చిక్కబళ్ళాపుర - మునిరాజు, కోలారు - రామాంజినప్ప. 

                                                       

ఆయన కొన్ని నెలల కిందట ‘కర్ణాటక ప్రజ్ఞావంతుల జనతా పార్టీ’(కేపీజేపీ)ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కర్ణాటక వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాధారణ ప్రజలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు తారస్థాయికి చేరడంతో కేపీజేపీ నుంచే ఉపేంద్ర బయటకు వచ్చేశారు.