కేఏ పాల్ కు భీమవరంలోనూ చుక్కెదురు: ఆలస్యమైందని నామినేషన్ తిరస్కరణ

22:09 - March 25, 2019

 *కేఏ పాల్ కు భీమవరం లోనూ చేదు అనుభవం 

*ఆలస్యమైన్దంటూ నామినేషన్ పత్రాల నిరాకరణ 

*నన్ను పోటీ చేయకుండా కుట్ర చేస్తున్నారంటూ పాల్ ఆరోపణ  

 

 

కేఏ పాల్ కి భీమవరం లోనూ చుక్కెదురయ్యింది. ఆయన నామినేషన్ వేయటానికి వెళ్ళేసరికే సమయం ముగిసిపోయిందంటూ రిటర్నింగ్ అధికారులు ఆయన పత్రాలు తీసుకోవటానికి నిరాకరించారు. దీంతో ఇప్పుడు పాల్ పరిస్తితి ఎటూ తోచకుండా ఉంది. అయితే పాల్ మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్.. సోమవారం (మార్చి 25) మధ్యాహ్నం భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు.

అంతకుముందే తన బంధువు ఒకరితో నామినేషన్ పత్రాలను పంపించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉండగా.. అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు నిరాకరించారు. 
తన తరఫున ఒక ప్రతినిధి అన్ని పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకే ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లారని, తర్వాత కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ... అప్పటికే సమయం అయిపోయిందని అధికారి చెప్పారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు 

 ఆయన నర్సాపురం లో దాఖలు చేసిన పత్రాలలో కూడా సరైన వివరాలు లేవంటూ మళ్ళీ సరిగా పూర్తి చేసి ఇవ్వాలని కోరిన తర్వాత కూడా రెండోసారి సమర్పించిన పత్రాలని కూడా సంపూర్తిగా వదిలేసరనే మాటే వినపడుతూందటంతో ఈ సారి కూడా నర్సాపురం నామినేషన్ రిజెక్ట్ అయితే ఇక ఈసారికి పాల్ పోటీలో లేనట్టే అనుకోవాలి.  నర్సాపురం లో  కేఏ పాల్ నామినేషన్ పత్రాన్ని ఓసారి పరిశీలించినట్లయితే.. నామినేషన్ పత్రాల్లోనే ఫామ్ 2ఏలోని మొదటి పేజీలో అభ్యర్థి స్టాంప్ సైజ్ ఫొటోను అంటించాల్సి ఉంటుంది. అక్కడ ఎటువంటి ఫొటోను పాల్ అంటించలేదు. తన విద్యాభ్యాసం గురించి పాల్ ఏమీ రాయలేదు. పాల్ నామినేషన్‌ను సమర్థిస్తూ ఏ ఒక్కరి సంతకాలు నామినేషన్ పత్రాల్లో లేవు.
 
పాన్ నంబర్‌ను రాసిన కేఏ పాల్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. చేతిలో నగదు 30వేల రూపాయలు ఉన్నాయని పేర్కొన్న పాల్.. తన స్థిర,చరాస్థుల గురించి రాయలేదు. 22నే పాల్ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పాల్ నామినేషన్ పత్రాల్లో చూసి షాకైన రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారు. 25వ తేదీలోపు మళ్లీ నామినేషన్‌ను సమర్పించాల్సిందిగా సూచించారు. దీంతో పాల్ మళ్లీ నామినేషన్‌ను దాఖలు చేశారు. గతంలో మాదిరిగానే నామినేషన్ పత్రాలను తూతూ మంత్రంగా పూర్తి చేసి మమ అనిపించారా లేక సక్రమంగా పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించారా అనే విషయం రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది. మొత్తం మీద కేఏ పాల్  ఈ ఎన్నికలలో చెడు అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు ,ఆయన ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతోంది.