పుల్వామా దాడిలో ఉన్నది కాశ్మీరీనే ? : జైష్ ఏ మొహమ్మద్ వీడియో సందేశం

22:32 - February 14, 2019

పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 20 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులు ఈ దాడి కోసం భారీ స్థాయిలోనే పేలుడు పదార్థాలు ఉపయోగించారు. పేలుడు కోసం ఉగ్రవాదులు స్కార్పియో వాహనంలో 350 కిలోల పేలుడు పదార్థాలు తీసుకొచ్చారు. 


ee దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాది అదిల్ అలియాస్ వకాస్ కశ్మీర్ కు చెందినవాడే. దక్షిణ కశ్మీర్ కాకపోరా జిల్లాకు చెందిన వకాస్ జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నాడు. ఈ విషయాన్ని వకాస్ వీడియో సందేశంలో ఉంది. తనను తాను పేల్చుకుని దాడికి పాల్పడిన వకాస్..పేలుడుకు ముందు రికార్డు చేసిన వీడియోను జైషే మహ్మద్‌ సంస్థ విడుదల చేసింది. వీడియోలో వకాస్ తన రెండు చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని..బ్యాక్ డ్రాప్ లో జైషే మహ్మద్ జెండాతో ఉన్నాడు.

ఈ ‘వీడియో మిమ్మల్ని చేరుకునే సమయానికి నేను పరలోకంలో ఉంటాను. జైషే మహ్మద్ సంస్థలో సంవత్సరం పాటు ఉన్నా. కశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం అని’ ఉగ్రవాది వకాస్ చెప్పాడు. సీఆర్‌పీఎఫ్ వాహ‌నాన్ని ఓ ఇనుప ముద్ద‌లా మార్చేసింది. బస్సును ముద్ద‌లా మార్చిందంటే అది ఎంత శ‌క్తివంత‌మైన పేలుడో అర్థ‌మ‌వుతోంది. ఫిదాయిన్ దాడి వ‌ల్ల కాన్వాయ్‌లోని ఓ బ‌స్సు రెండు రోల‌ర్ల మ‌ధ్య న‌లిగిన ఇనుములా త‌యారైంది. ఆ బ‌స్సులో ఉన్న జ‌వాన్ల శ‌రీర భాగాలు కూడా జ‌మ్మూ హైవేపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. ఇంత భ‌యాన‌క‌మైన దాడి ఎన్న‌డూ జ‌ర‌గలేదు. అత్యంత సేఫ్ రూట్లో ఈ దాడి జ‌ర‌గ‌డం అంద‌ర్నీ క‌లిచివేస్తోంది. ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం ఈ దాడిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

 ఉగ్రవాదుల దాడి ఘటనను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. కేంద్రం అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సీఆర్ పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని అరుణ్ జైట్లీ హెచ్చరించారు