నింగికెగసిన నిఘానేత్రం: పీఎస్‌ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతం

12:42 - April 1, 2019

*ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45

.*పీఎస్‌ఎల్వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం

*డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలు

 

 

మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో (ISRO). పీఎస్‌ఎల్‌వీ - సీ45 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.  డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 4 స్ట్రాపాన్ బూస్టర్లతో శాస్త్రవేత్తలు తొలిసారి ఈ ప్రయోగం నిర్వహించారు. పీఎస్ఎల్‌వీ - క్యూఎల్‌గా ఈ శాటిలైట్‌కు నామకరణం చేశారు.


       నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45 సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్‌డౌన్‌, ప్రయోగ రిహార్సల్స్‌ చేశారు. షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

                                                                     

ఈ రాకెట్‌ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశ పెట్టారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.  ఈ తరహా రాకెట్‌ను మొట్టమొదటిసారిగా ఇస్రో ప్రయోగిస్తోంది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం కాగా, షార్‌ కేంద్రం నుంచి 71వ ప్రయోగం.   

డీఆర్డీఓ రూపొందించిన ఇమిశాట్ శత్రు దేశాల రాడార్ల జాడ గుర్తించడంలో దిట్ట. 436 కిలోల బరువున్న ఈ శాటిలైట్ తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ రక్షణశాఖకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం సేకరణ కోసం భారత్ విమానాలపై ఆధారపడుతోంది. ఇమిశాట్ రాకతో ఇక అంతరిక్షం నుంచి శత్రువుల కదలికలపై కన్నేసే అవకాశం లభిస్తుంది. 

                                                        
అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. మిగిలిన నాలుగో దశ రాకెట్‌ (పీఎస్-4)ను సైంటిస్టులు ప్రయోగాత్మకంగా 3వ కక్ష్యలోకి (485 కిలోమీటర్ల ఎత్తులో) తీసుకెళ్లబోతున్నారు. ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్‌ ఐడింటికేషన్‌ సిస్టమ్‌ ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది .

                                                        

రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఆటోమ్యాటిక్‌ పాకెట్‌ రిపెరింగ్‌ సిస్టమ్‌ రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూపొందించిన అడ్వాన్డ్‌ రీట్రేడింగ్‌ పొటెన్షియల్‌ అనలైజర్‌ ఫర్‌ లోనో స్పెరిక్‌ స్టడీస్‌ పరికరం ఐనోస్పియర్‌ పొరపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడుతుంది.