కొత్త 20 రూపాయల కాయిన్ ఇదే : పాత వాటిలోనూ మార్పులు

22:59 - March 7, 2019

*భారత కరెన్సీలో మరో కొత్త కాయిన్ 

*చలామనీ లోకి రూ.20 నాణెం, పాత వాటిలోనూ మార్పులు 

*అంధులకు సహాయపడేలా ప్రత్యేక డిజైన్‌

 

 

భారత ప్రభుత్వం మరోసారి కొత్త నాణేణ్ణి ప్రవేశ పెట్టింది. కరెన్సీలో ఇప్పటికి కాలంతో పాటుగా కనుమరుగైన నాణేలు పోగా ఇప్పటికి ఒక రూపాయి నాణెం నుంచి ఆ పైన విలువగల రూ.2, రూ5, రూ పది నాణేలు మాత్రం ఇప్పుడు చలామనీలో ఉండగా ఇప్పుడు వీటికి తోడుగా కొత్తగా రూ.20 నాణెం కూడా చేరింది అయితే ఈసారి ఈ కొత్త కాయిన్ తో పాటు పాతవి కూడా కొత్త రూపంతో రాబోతున్నాయి. ఈ కొత్త సిరీస్ లో ఇప్పటికే చలామనీ అవుతున్న  రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 లు సరికొత్త డిజైన్ తో రానున్నాయి. ఈ కొత్తరూపంతో వస్తున్న పాత నాణేలతో పాటుగా రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం విడుదల చేశారు. 


 దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడేలా  వీటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేసారట.  న్యూఢిల్లీలో  ప్రధాని ఇంటి వద్ద నిర్వహించిన నాణేల విడుదల కార్యక్రమానికి  అంధవిద్యార్థులను ప్రత్యేకంగా  ఆహ్వానించారు. ​కొత్తగా చలామణిలోకి వచ్చిన నాణేలలోని వైవిధ్యపూరితమైన ఫీచర్లు దివ్యాంగులకు బాగా సహాయపడతాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ నాణేనికి రెండు రింగులు ఉంటాయి. బయటి రింగ్‌ను 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో తయారు చేయగా, లోపలి రింగ్‌ను 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో తయారు చేశారు. అయితే, ఈ నాణెం మార్కెట్లోకి ఎప్పుడు రాబోతోందన్న విషయాన్ని ఆర్థిక శాఖ వెల్లడించలేదు. పదేళ్ల క్రితం చలామణిలోకి తీసుకొచ్చిన పది రూపాయల నాణెం విషయంలో ప్రస్తుతం బోల్డన్ని అపోహలు ఉన్నాయి. 


    ఇప్పటి వరకు దీని డిజైన్‌ను 14 సార్లు మార్చారు. ఇది చెల్లదంటూ వదంతలు వ్యాపించడంతో వ్యాపారులు దీనిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నాణెం చెల్లుతుందని రిజర్వు బ్యాంకు పలుమార్లు ప్రకటించింది. తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ఈ నాణేన్ని తీసుకునేందుకు కొందరు వెనకడుగు వేస్తున్నారు. 2009 మార్చిలో రూ.10నాణెన్ని విడుదల చేయగా.. కొత్త రూ.20 నాణెం విడుదల తేదీని ప్రకటించలేదు. రూ.10 నాణెలు చెల్లవంటూ ఇప్పటికే మార్కెట్లో తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆర్బీఐ కొత్తగా రూ.20 నాణెం తీసుకొస్తుండడంతో దీనిపైనా ఎలాంటి వదంతులు వస్తాయో చూడాలి మరి.