ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు హైజాగ్‌ హెచ్చరిక...

12:35 - February 24, 2019

పుల్వామా దాడి జరిగి పదిరోజులైనా కాకముందే మరో హెచ్చరిక గంట మోగింది! ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి పాకిస్థాన్‌కు తీసుకుపోబోతున్నామంటూ ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌తో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాల భద్రతా విభాగాలు, విమానయాన సంస్థలు తప్పనిసరిగా, తక్షణమే పాటించాల్సిన ఎనిమిది భద్రతా చర్యలతో ఒక నోట్‌ విడుదల చేసింది. 

•    విమానాశ్రయాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ రాకపోకలపై కఠిన నియంత్రణలు విధించాలి.
•    ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ప్రయాణికులను, విమానాశ్రయ సిబ్బందిని, సందర్శకులను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలి.
•    టెర్మినల్‌ బిల్డింగ్‌, ఆపరేషనల్‌ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత పటిష్ఠం చేయాలి. సీసీ టీవీ కెమెరాలతో సరిపెట్టకుండా భద్రతాధికారులు సైతం       అప్రమత్తంగా ఉండి నిఘా పెట్టాలి.
•    కారు బాంబు తరహా దాడులను నిరోధించేందుకు.. విమానాశ్రయాల కార్‌ పార్కింగ్‌లోకి వచ్చే అన్ని వాహనాలనూ పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలి.
•    విమానంలోకి తీసుకెళ్లే హ్యాండ్‌ బ్యాగేజీ, విమానంలోకి ఎక్కించే లగేజీతోపాటు.. కార్గో టెర్మినల్‌, కేటరింగ్‌, మెయిల్స్‌ ఇలా అన్నిటినీ పూర్తిస్థాయిలో తనిఖీ           చేయాలి.
•    కార్గో గేట్లు, వాహనాలు ప్రవేశించే ద్వారాల వద్ద సాయుధ భద్రత ఏర్పాటు చేయాలి. స్థానిక నిఘా వర్గాల సమాచారం మేరకు అదనపు భద్రతా ఏర్పాట్లు             చేయాలి.
•    తక్షణ ప్రతిస్పందన విభాగాన్ని, పెరీమీటర్‌ పెట్రోలింగ్‌ను పటిష్ఠం చేయాలి.

అంతేకాదు..గల్ఫ్‌ దేశాలకు, పాకిస్థాన్‌కు వెళ్లే విమానాలకు సంబంధించి సెకండరీ లాడర్‌పాయింట్‌ చెకింగ్‌కు (ఎస్‌ఎల్‌పీసీ.. అంటే అన్ని చెకింగ్‌లూ ముగించుకుని వచ్చిన ప్రయాణికులను విమానం ఎక్కే సమయంలో మరోసారి తనిఖీ చేయడం) ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ప్రయాణికులు నిర్ణీత సమయానికన్నా ముందుగా రావాలని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎ్‌ఫ)కు చెందిన ఒక ఉన్నతాధికారి విజ్ఞప్తి చేశారు.